
క్రేన్ సాయంతో రూపొందిస్తున్న 63 అడుగుల ఎత్తు బతుకమ్మ
సరూర్‌నగర్ స్టేడియం వేదికగా నేడు గిన్నిస్ వరల్డ్ రికార్డు దిశగా సంబురాలు
ప్రత్యేక ఆకర్షణగా 63 అడుగుల ఎత్తు బతుకమ్మ...ఆడిపాడనున్న 10 వేల మంది మహిళలు
హాజరు కానున్న సీఎం రేవంత్‌రెడ్డి.. స్టేడియంలో భారీగా ఏర్పాట్లు
హుడాకాంప్లెక్స్ (హైదరాబాద్): ‘బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.., ఒక్కేసి పువ్వేసి సందమామా.. చిత్తూచిత్తూల బొమ్మ.. శివుని ముద్దుల గు మ్మ.. బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోనా’అంటూ బతుకమ్మ పాటలతో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం మార్మోగనుంది. బంతి, చేమంతి, గునుగు, గులాబీ, తంగేడు, గడ్డిపువ్వు వంటి తీరొక్క పూలతో తయారు చేసిన బతుకమ్మలు దర్శనమివ్వబోతున్నాయి. ఒకే వేదికపై పదివేల మంది మహిళలు బతుకమ్మ ఆడిపాడి కనువిందు చేయబోతున్నారు. మన బతుకమ్మ కారి్నవాల్ పేరుతో నిర్వహించనున్న ఈ అద్భుత దృశ్య కావ్యానికి సరూర్‌నగర్ స్టేడియం వేదిక కాబోతోంది.
‘గిన్నిస్ వరల్డ్ రికార్డు’ఈవెంట్
నవరాత్రి వేడుకల్లో భాగంగా తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం సరూర్‌నగర్ వేదికగా నిర్వహించ తలపెట్టిన ‘గిన్నిస్ వరల్డ్ రికార్డు ఈవెంట్’కు భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇండోర్ సహా అవుట్ డోర్ స్టేడియాల్లో 63 అడుగుల ఎత్తు బతుకమ్మను ఏర్పాటు చేస్తున్నారు. గ్రేటర్ జిల్లాలు సహా సరిహద్దు జిల్లాల నుంచి 200 బస్సుల్లో మహిళలను ఆదివారం ఉదయమే స్టేడియానికి రప్పించి, ఆయా పాటలకు శిక్షణ ఇప్పించారు. వేడుకలో భాగంగా పాడే పాటలు, ప్రదర్శనలపై ముందే రిహార్సల్స్ చేశారు. సోమవారం సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య నిర్వహించనున్న బతుకమ్మ ప్రదర్శనను గిన్నిస్ వరల్డ్ రికార్డులో సంస్థ ప్రతినిధులు నమోదు చేయనున్నారు.
సీఎం సహా పలువురు మంత్రుల రాక
వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క, పలువురు మహిళా ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. పోలీసు లు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎ ల్బీనగర్ నుంచి దిల్‌సుఖ్‌నగర్ వైపు వెళ్లే వా హనాలను దారి మళ్లించనున్నారు. ఈ మేరకు ఆదివారం అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ పంకజా, టూరిజం ఎండీ క్రాంతి, పలువురు అధికారులు స్టేడి యానికి చేరుకొని ఏర్పాట్లను పరిశీలించారు.