Friend Ship Day 2021: స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం

Telangana: Friendship Day Special Stories In Karimnagar - Sakshi

ఫ్రెండ్‌.. అందరికీ ఇష్టమైన పదం. స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అన్నట్లు.. బాధలో ఉన్నప్పుడు మొదటగా గుర్తుకొచ్చేది స్నేహితుడు.. సంతోషాన్ని పంచుకునేందుకు వెంట ఉండేది స్నేహితుడు. జాతి, మతం అన్న తేడాల్లేకుండా ఇద్దరు వ్యక్తులను కలిపిఉంచే బంధం కేవలం స్నేహానిది మాత్రమే. ఏ రక్త బంధంతో నిమిత్తం లేకుండా చివరి వరకు నిలిచేది స్నేహితుడు. ట్రెండు మారినా ఫ్రెండ్‌ మారడే అన్న నానుడి కూడా స్వచ్ఛమైన స్నేహం నుంచి జన్మించిందే. ఏ స్వార్థం చూసుకోకుండా మనసు గెలిచిన స్నేహితుల బాగోగుల కోసం శ్రమించే స్వభావం ప్రస్తుత ప్రపంచంలో అరుదుగానే లభిస్తుందని చెప్పాలి. ఉమ్మడి జిల్లాలో చాలామంది స్నేహితులు కరోనా సమయంలో అండగా నిలిచారు. ఆపద సమయంలో ప్రాణాలు కాపాడారు. కాల పరీక్షకు ఎదురుగా నిలుస్తూ స్వచ్ఛమైన స్నేహానికి నిదర్శనంలా కనిపిస్తున్న పలువురిపై స్నేహితుల దినోత్సవం సందర్భంగా కథనాలు..

ఫేస్‌బుక్‌ మిత్రుల రూ.1.12లక్షల సాయం


సాక్షి, ధర్మపురి(కరీంనగర్‌): ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నిరుపేద మహిళకు ఫేస్‌బుక్‌ మిత్రులు అండగా నిలిచి రూ.1.22లక్షల సాయం అందించారు. ధర్మపురికి చెందిన నరుముల లక్ష్మీ భర్త కొన్నినెలల క్రితం చనిపోయాడు. కొడుకు పుట్టుకతోనే మానసిక దివ్యాంగుడు. కూలీపని చేస్తూ.. కూతురును బీఈడీ చదివిస్తోంది. భర్త మరణంతో పోషణ కష్టమైంది. ఇల్లుగడవని పరిస్థితి ఎదురైంది. కూతురు చుదువు మానిపించేద్దామని అనుకుంది. విషయం తెలుసుకున్న సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్‌ లక్ష్మీ కష్టాలను గురించి జూలై 5న ఫేస్‌బుక్‌లో పోస్టుచేసి సాయం అందించాలని మిత్రులను కోరాడు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నారై మిత్రులు రూ.1.17లక్షలు, ధర్మపురికి చెందిన కొరెడె కిరణ్‌కుమార్‌ మిత్రబృందం రూ.5 వేలు సాయం అందించారు. డిపాజిట్‌ బాండ్లను సీఐ కోటేశ్వర్, ఎస్సై కిరణ్‌కుమార్‌ చేతుల మీదుగా శనివారం అందించారు.

ఆదుకున్న స్నేహితులు
కోరుట్ల: తమతో చదువుకున్న స్నేహితుల్లో మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో ఒకరు.. ఏడాది క్రితం అనారో గ్యంతో మరొక రు మృతి చెందడంతో మిత్రులు వారి కుటుంబాలకు అండగా నిలిచారు. కోరుట్లలోని ఆదర్శ విద్యాలయం 1994–95 బ్యాచ్‌ పదో తరగతి విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విడిపోయినా తమ స్నేహ బంధాన్ని వీడలేదు. ఈ మిత్ర బృందంలో గాజెంగి శ్రీధర్‌ మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు పోతుగంటి శ్రీనివాస్, అంబల్ల ఆనంద్, తాళ్ల్లపల్లి శ్రీనివాస్‌లు తమ మిత్రు ల సహకారంతో రూ.1,02,000 శ్రీధర్‌ కూతురు నిత్య పేరిట డిపాజిట్‌ చేశారు. మరో స్నేహితుడు వాసం విద్యాసాగర్‌ ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందగా అతడి కుటుంబానికి రూ.1,60,000 ఆర్థికసాయం అందించారు.

బడి సోపతికి 37ఏళ్లు
బోయినపల్లి(చొప్పదండి): విభిన్నానికి మారుపేరు కరీంనగర్‌ అడిషనల్‌ కలెక్టర్‌ జీవీ.శ్యాంప్రసాద్‌లాల్‌. ఆయనకు స్నేహమంటే ప్రాణం. స్నేహాన్ని మనసుతో చూస్తారు. ఉద్యోగంతో పాటు స్నేహాన్ని సైతం ఓ బాధ్యతగా తీసుకుని 37ఏళ్లుగా అల్లుకుపోతున్నారు. హుస్నాబాద్‌ 1983–84 ఎస్సెస్సీ బ్యాచ్‌ ఇతడిది. బడిసోపతులు పేరిట శ్యాంప్రసాద్‌లాల్‌ ఆధ్వర్యంలో దేశ, విదేశాల్లో ఉన్న స్నేహితులను సమన్వయం చేసుకుంటూ, సోపతుల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ గెట్‌టు గెదర్‌ నిర్వహిస్తున్నారు.

కొత్తపల్లి అశోక్, కొండూరి శ్రీనివాస్, ఆశోక్‌కుమార్‌ కామారపు, అన్నవరం శ్రీనివాస్, బాపిరాజు, రజని, లత, ఉమారెడ్డి కోర్‌కమిటీ సభ్యులతో ముందుకు సాగుతున్నారు. అనుకోకుండా చనిపోయిన ఇద్దరు మిత్రుల కూతుళ్ల వివాహానికి రూ.4 లక్షలు, ఆర్థికంగా లేని స్నేహితుల కూతుర్ల వివాహానికి రూ.2.50 లక్షలు, అనారోగ్యంతో బాధ పడుతున్న మిత్రులకు రూ.2లక్షల చొప్పున సాయం అందించారు.

పాతికేళ్ల స్నేహం
సిరిసిల్లకల్చరల్‌: సిరిసిల్లలో నివాసం ఉంటున్న వేముల తిరుపతి, ఎలగొండ రవీందర్‌ టైలరింగ్‌ పని మీద తొ లిసారి బతుకుదెరువు కోసం ముంబైకి వెళ్లినపుడు కలుసుకున్నారు. దాదాపు పాతికేళ్లుగా కలిసే ఉంటున్నారు. రవీందర్‌ కుటుంబం కరోనా బారిన పడగా.. తిరుపతి అన్ని వి«ధాలుగా అండగా ఉండి మనో«ధైర్యం కలిగించాడు.

దైవం కలిపిన బంధం 
సిరిసిల్లకల్చరల్‌: సిరిసిల్లకు చెందిన హనుమాండ్ల శ్రీకాంత్, మహ్మద్‌ ఫరీ ద్‌ ఆరోతరగతి నుంచి స్నేహితులు. గత మే నెలలో శ్రీకాంత్‌ ఇంట్లో అందరూ కోవిడ్‌ బారిన పడ్డారు.  ఫరీద్‌ కు ఫోన్‌ చేశాడు శ్రీకాంత్‌. రాత్రి గంటలకు ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించాడు. ఆక్సిజన్‌ లేదని డాక్టర్లు చేతులెత్తేశారు. వెంటనే ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తే అక్కడ పడకలు లేవు. తనకున్న పరిచయాలతో ఆక్సిజన్‌ బెడ్‌ తెప్పించాడు. వారంపాటు కంటికి రెప్పలా కాపాడాడు. ‘మొదట్నుంచి అతనే లేకపోతే ఈ రోజు నేనిలా ఉండలేక పోయేవాడిని’ 
అని శ్రీకాంత్‌ చెప్పాడు.

క్లాస్‌మేట్స్‌.. జాబ్‌మేట్స్‌


బోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లికి చెందిన మాడిచెట్టి సాయికిరణ్, వాసాల సంతోశ్, మోగులోజి నరేశ్‌ ఊహ తెలిసినప్పటి నుంచి స్నేహితులు. ఒకేపాఠశాల,ఇంటర్, డిగ్రీ కలిసి చదివారు. గ్రామంలో కలిసి సాధనచేసి 2019లో పోలీస్‌ ఉద్యోగాలు సాధించారు. సాయికిరణ్‌ ఏఆర్‌ పీసీగా కరీంనగర్‌లో, సంతోష్‌ మంచిర్యాలలో టీఎస్‌ఎస్‌పీ పీసీగా, నరేశ్‌ సిరిసిల్ల 17వ బెటాలియన్‌లో పీసీగా ఉద్యోగం చేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top