సీఎం కేసీఆర్‌ పీఆర్వో విజయ్‌ రాజీనామా!

Telangana CM PRO Vijay Kumar Resigns - Sakshi

సీఎం పీఆర్వో విజయ్‌ తొలగింపు!

రాజీనామా చేయించిన ప్రభుత్వం

ట్రాన్స్‌కో జనరల్‌ మేనేజర్‌ పదవికి సైతం రిజైన్‌

తీవ్ర ఆరోపణలు రావడంతో సీఎం ఆగ్రహం!

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ (పీఆర్వో) గటిక విజయ్‌కుమార్‌ బుధవారం రాజీనామా చేశారు. సీఎం పీఆర్వో పోస్టుతోపాటు ట్రాన్స్‌కో జనరల్‌ మేనేజర్‌ (కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌) పోస్టుకు కూడా ప్రభుత్వం ఆయనతో రాజీనామా చేయించింది. ఈ రాజీనామాలు తక్షణమే ఆమోదం పొందాయి. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించిన విజయ్‌కుమార్‌.. అకస్మాత్తుగా రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. తీవ్ర స్థాయిలో ఆరోపణలు రావడంతోనే కేసీఆర్‌ ఆగ్రహానికి గురైనట్టు ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. వ్యక్తిగత కారణాలతో సీఎం పీఆర్వో పోస్టుకు రాజీనామా చేసినట్టు విజయ్‌కుమార్‌ బుధవారం ఫేస్‌బుక్‌ ద్వారా ప్రకటించారు. గొప్ప స్థాయిలో పనిచేసే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రులు, ఉన్నతాధికారుల్లో అసంతృప్తితో..
విజయ్‌కుమార్‌ కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్డుగా పెట్టుకుని మంత్రులు, ఉన్నతాధికారులతో ఆధిపత్య ధోరణిలో వ్యవహరించేవారన్న ఆరోపణలున్నాయి. దీనిపై వారు చాలా రోజులుగా అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. గతంలో వివిధ న్యూస్‌ చానళ్లలో రిపోర్టర్‌గా పనిచేసిన విజయ్‌కుమార్‌.. ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో సీఎం పీఆర్వోగా నియమితుడై.. కొద్దికాలంలోనే కేసీఆర్‌కు దగ్గరయ్యారు. ప్రగతి భవన్‌లో కీలక వ్యక్తిగా ఎదిగారు. విజయ్‌కుమార్‌ కోసమే ట్రాన్స్‌కో యాజమాన్యం మూడేళ్ల కింద జనరల్‌ మేనేజర్‌ (కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌) పోస్టును సృష్టించి, ఆయనను ఎంపిక చేసింది. ఇలా ప్రాధాన్యత పెరిగిపోవడంతో విజయ్‌కుమార్‌ పలు వ్యవహారాల్లో కల్పించుకుని ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

సిద్దిపేట పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ మహిళకు సంబంధించిన కుటుంబ తగాదా కేసులో విజయ్‌కుమార్‌ జోక్యం చేసుకుని, పోలీసులపై ఒత్తిడి తెచ్చారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఓ ఇసుక రీచ్‌ను సైతం తన వ్యక్తులకు ఇప్పించుకున్నట్టు ఆరోపణలున్నాయి. వీటికితోడు ప్రగతిభవన్‌ నుంచి రాజకీయ అంశాలపై కొందరికి లీకులు ఇచ్చేవారన్న ప్రచారం ఉంది. వరంగల్‌ జిల్లాలో పలు భూవివాదాల్లో జోక్యం చేసుకున్నట్టు ఇంటెలిజెన్స్‌ నుంచి సీఎంకు నివేదిక అందినట్టు సమాచారం. ఈ ఆరోపణలతోనే రాజీనామా చేయాల్సి వచ్చినట్టు తెలిసింది. దీనిపై ‘సాక్షి’వివరణ కోరగా విజయకుమార్‌ స్పందించలేదు.   

చదవండి: నెల రోజులుగా సీఎం కేసీఆర్‌ బిజీబిజీ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top