Dalit Bandhu: దళితబంధు లబ్ధిదారులు: ఆ 15 మంది ఎవరు?

Telangana: CM KCR Launching Dalitha Bandhu Scheme In Karimnagar District - Sakshi

గోప్యంగా హుజూరాబాద్‌ ‘దళితబంధు’ లబ్ధిదారుల వివరాలు

నేటి ఉదయమే వారికి తెలియజేసే అవకాశం!

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న దళితబంధు పథకాన్ని సోమవారం(నేడు) ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. తొలుత ఎంపిక చేసిన 15 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున చెక్కులు అందజేయనున్నారు. అయితే ఈ లబ్ధిదారుల వివరాలను అధికారులు, నేతలు వెల్లడించడంలేదు.

పాత్రికేయులు ఎంత ప్రశ్నించినా ఎవరూ నోరు మెదపడం లేదు. అనర్హులను జాబితాలో చేర్చారంటూ పలువురు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా లబ్ధిదారుల వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. లబ్ధిదారుల పేరిట కొందరు ప్రభుత్వ ఉద్యోగులను పథకానికి ఎంపిక చేశారంటూ శుక్రవారం ప్రజలు ఆగ్రహంతో రోడ్ల మీదకు వచ్చి ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.

ఈ విషయమై కలెక్టర్‌ కర్ణన్, సీఎస్‌ సోమేశ్‌ కుమార్, మంత్రులు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇంతవరకూ ఎలాంటి జాబితా ఖరారు కాలేదని అధికారులు చెబుతున్నారు. అయితే శనివారం నాటికే 15 మంది లబ్ధిదారుల జాబితాను అధికారులు సిద్ధం చేశారని తెలిసింది. ఈ విషయాన్ని లబ్ధిదారులకు కూడా తెలియపరచకపోవడం గమనార్హం.

సోమవారం ఉదయమే వారికి ఈ విషయం వెల్లడిస్తారని సమాచారం. దళితుల జీవనప్రమాణాలను మెరుగుపరిచేందుకు, వారిని ఎంటర్‌ప్రెన్యూయర్లుగా తీర్చిదిద్దేందుకు హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన ‘దళితబంధు’పథకం కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.500 కోట్లు విడుదల చేసింది. పథకంపై ఎలాంటి అపోహలు వద్దని, క్రమంగా అర్హులందరికీ అందజేస్తామని ప్రభుత్వం భరోసా ఇస్తోంది.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top