ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ రద్దు

Telangana CM KCR Approval Termination of Private Practice In Govt Hospital - Sakshi

సీఎం ఆమోదం... 2–3 రోజుల్లో మార్గదర్శకాలు

కొత్తగా నియమితులయ్యే ప్రభుత్వ డాక్టర్లకు మాత్రమే అమలు

వైద్య పోస్టుల సర్వీస్‌ రూల్స్‌లో మార్పులు..

కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వెయిటేజీ ఖరారు  

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌ను రద్దు చేయాలని సర్కారు నిర్ణయించింది. అయితే ఇకపై సర్కారు ఆసుపత్రుల్లో నియమితులయ్యే వైద్యులకు మాత్రమే ఈ నిర్ణయాన్ని వర్తింపజేయనుంది. ఈ అంశంపై వైద్య, ఆరోగ్యశాఖ చేసిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదం తెలిపినట్లు ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి.

రాష్ట్రంలో డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు, ఏఎన్‌ఎంలు, పారామెడికల్‌ సిబ్బందిని నియమించాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకోసం కసరత్తు చేపడుతోంది. నియామక మార్గదర్శకాలను 2–3 రోజుల్లోగా విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మార్గదర్శకాల్లో ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేటు ప్రాక్టీస్‌ రద్దు అంశం కీలకమైందని చెబుతున్నాయి. మరోవైపు కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి ఆయా పోస్టుల భర్తీలో గతంలో ఇచ్చినట్లుగానే వెయిటేజీ ఉంటుందని ఒక కీలకాధికారి తెలిపారు.

సర్వీస్‌ రూల్స్‌ల్లో మార్పులు...
రాష్ట్రంలో మొత్తం 12,755 వైద్య సిబ్బంది పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవగా వాటిలో 10 వేలకుపైగా పోస్టులను మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ ఆర్‌బీ) భర్తీ చేయనుంది. డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు, ఏఎన్‌ఎం పోస్టులను మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు భర్తీ చేయనుండగా ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులను మాత్రం టీఎస్‌పీఎస్సీ భర్తీ చేయనుంది.

పోస్టుల భర్తీకి సంబంధించి సుమారు 20 ఏళ్ల నాటి సర్వీస్‌ రూల్స్‌ను మార్చే ప్రక్రియ దాదాపు పూర్తయింది. గతంలో స్టాఫ్‌ నర్సులు, ఇతర పారామెడికల్‌ పోస్టుల భర్తీ సమయంలో తలెత్తిన న్యాయ చిక్కుల వంటివి ఈసారి తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరించాలని వైద్య యంత్రాంగం భావిస్తోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు వైద్య కోర్సుల్లో, పోస్టుల్లో మార్పులు ఎన్నో మార్పులు ఉండటంతో పాత సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం కొత్త కోర్సులు చేసిన వారు అనర్హులయ్యే పరిస్థితులు న్నాయి.

ముఖ్యంగా ల్యాబ్‌ టెక్నీ షియన్లలో దాదాపు 30 రకాల విభాగాలు, కోర్సులు వచ్చాయి. అంటే కార్డియో టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, న్యూరోకు సంబంధించి టెక్నీషియన్, వివిధ కొత్త యంత్రాలకు టెక్నీషియన్లు వచ్చారు. వాటికి కోర్సులు కూడా వచ్చాయి. ఇలా 30 రకాల కోర్సులు చేసిన వారందరూ అర్హులు కాబట్టి వేర్వేరు కోర్సులకు వేర్వేరు సిలబస్‌ తయారు చేయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన సర్వీస్‌ రూల్స్‌ను మార్చారు.

స్టాఫ్‌ నర్సుల పోస్టులకు 20 వేల మంది పోటీ!
వైద్య, ఆరోగ్యశాఖలో పోస్టులను ప్రకటించిన తర్వాత స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఏఎన్‌ఎంల కోసం అభ్యర్థులు పెద్ద ఎత్తున సన్నద్ధం అవుతున్నారు. స్టాఫ్‌ నర్సుల భర్తీ దాదాపు నాలుగేళ్ల తర్వాత జరుగుతుండటంతో 4,722 స్టాఫ్‌ నర్సు పోస్టుల కోసం 20 వేల మంది పోటీ పడే అవకాశముంది. అలాగే 1,520 ఏఎన్‌ఎం పోస్టుల కోసం 6 వేల మంది పోటీ పడే అవకాశం ఉందని అంటున్నారు. దాదాపు 2 వేల వరకున్న ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులకు 8 వేల మంది పోటీ పడొచ్చని వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top