మూసీ ప్రక్షాళనకు వేగంగా అడుగులు

Telangana CM for early start to Musi Riverfront development work - Sakshi

నదీపరీవాహక అభివృద్ధిపై సీఎం సమీక్ష 

వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని ఆదేశించిన రేవంత్‌రెడ్డి 

మొదటగా క్లీనింగ్‌ ప్రక్రియ పూర్తి చేయాలని సూచన 

సాక్షి, హైదరాబాద్‌: మూసీనది ప్రక్షాళన, అభివృద్ధి ప్రాజెక్టుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. సోమవారం నానక్‌రాంగూడలోని హెచ్‌ఎండీఏ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీ ప్రాజెక్టుపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మూసీ అభివృద్ధి పనులు వెంటనే చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. హెచ్‌ఎండీఏ కమిషనర్‌ దానకిశోర్, మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ, హెచ్‌ఎండీఏ జాయింట్‌ కమిషనర్‌ ఆమ్రపాలి, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధికారులు నగరంలోని 55 కిలోమీటర్ల మార్గంలో ఉన్న మూసీనదీ పరీవాహక ప్రాంతాలు సరిహద్దులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వివరించారు. ప్రక్షాళనకు చేపట్టాల్సిన చర్యలపైనా చర్చించారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా తొలగించాల్సిన నిర్మాణాలపైన కూడా ఈ సందర్భంగా చర్చించినట్టు తెలిసింది. అనంతరం సీఎం మాట్లాడుతూ వీలైనంత త్వరగా మూసీ అభివృద్ధి ప్రాజెక్టు ప్రారంభించేందుకు కసరత్తు చేపట్టాలని అధికారులకు చెప్పారు. మొదట క్లీనింగ్‌ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. మూసీ అభివృద్ధికి ఇటీవల బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఆ పనులపై దృష్టి సారించింది. మూసీ నదిని మూడు ప్రధాన విభాగాలుగా విభజించి పనులు చేపట్టేందుకు అధికారులు ఇప్పటికే కార్యాచరణ చేపట్టారు.  

అందంగా.. ఆహ్లాదంగా... 
హైదరాబాద్‌ మహానగరానికి పడమటి నుంచి తూర్పు వరకు మెలికలు తిరుగుతూ వడ్డాణం అలంకరించినట్టుండే మూసీనది నిజాం కాలంలో పరవళ్లు తొక్కింది. నగరంలో 55 కిలోమీటర్ల పొడవుతో విస్తరించి ఉన్న మూసీనదికి పూర్వవైభవాన్ని తెచ్చేందుకు గతంలోనే మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసినా పెద్దగా పురోగతి లేదు. ప్రసుత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించడంతో మళ్లీ ఆశలు చిగురించాయి. మూసీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తూర్పు–పడమర మధ్య మెట్రో మార్గం నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరోవైపు లండన్‌లోని థేమ్స్‌ నదిలా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. మూసీ అభివృద్ధికి ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు సైతం ముందుకొస్తున్నాయి. సింగపూర్‌కు చెందిన ఓ సంస్థ ప్రభుత్వంతో ఇటీవల సంప్రదింపులు జరిపింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మూసీకి రెండువైపులా ఎమ్యూస్‌మెంట్‌ పార్కులు, వాటర్‌ ఫాల్స్, చి్రల్డన్‌ వాటర్‌ స్పోర్ట్స్, స్ట్రీట్‌ వెండర్స్‌ బిజినెస్‌ ఏరియా, షాపింగ్‌ మాల్స్‌ ఇలా అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా అభివృద్ధి చేస్తారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లోని చారిత్రక కట్టడాలైన చార్మినార్, తారామతి బారదరీ, ఇతర పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ఒక టూరిజం సర్క్యూట్‌ కూడా డిజైన్‌ చేస్తున్నారు. పీపీపీ పద్ధతిలో ఈ ప్రాజెక్టును ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించనున్నారు.

whatsapp channel

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top