Musi River: మూసీపై హైకోర్టు సీజే వ్యాఖ్యలు.. ప్రక్షాళన ఎప్పుడో?

Telangana CJ Expresses Deep Concern Over Pollution at Hussain Sagar - Sakshi

సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌ అమలుకు ఎదురుచూపులు  

మురుగు కాల్వను తలపిస్తోందని హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ వ్యాఖ్య 

ఇటీవలి వర్షాలకు మూసీ నీటిలో పెరిగిన ఆక్సిజన్‌ శాతం 

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ సిటీ జీవనాడి చారిత్రక మూసీ నదికి లండన్‌లోని థేమ్స్‌.. గుజరాత్‌లోని సబర్మతి తరహాలో మహర్దశ ఎప్పుడు పడుతుందా అని మహానగర సిటీజన్లు ఎదురుచూస్తున్నారు. తాజాగా హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ హైకోర్టు సమీపంలో మూసీ నది మురుగు కాల్వను తలపిస్తోందని వ్యాఖ్యానించడంతో ఈ నది ప్రక్షాళన, సుందరీకరణ అంశం మరోసారి సర్వత్రా చర్చనీయాంశమైంది. 

మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో గత ఏడాది కాలంగా.. నగరంలో మూసీ ప్రవహిస్తోన్న 45 కి.మీ మార్గంలో (బాపూఘాట్‌– ప్రతాప సింగారం)ఘన వ్యర్థాలు, ప్లాస్టిక్, నిర్మాణ వ్యర్థాలను తొలగించడం, ప్రవాహ మార్గానికి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవడం, డ్రోన్లతో దోమల ఉద్ధృతి పెరగకుండా స్ప్రే చేయడం, పలు చోట్ల తీరైన నడకదారులు, హరిత వాతావరణం ఏర్పాటు చేయడం వంటి ఉపశమన చర్యలు తీసుకోవడం విశేషం.  

మరోవైపు ఇటీవలి కుండపోత వర్షాలకు నదిలో మురికి పైపైన కొట్టుకుపోయింది. మూసీ నీటిలో వృక్ష,జంతు ఫ్లవకాల మనుగడకు అవసరమైన కరిగిన ఆక్సిజన్‌ శాతం పెరగడం కూడా పెద్ద ఊరట. కానీ ఇవన్నీ పైపై మెరుగులేనని శాశ్వత పరిష్కార చర్యలు కావని పర్యావరణ వేత్తలు స్పష్టం చేస్తుండడం గమనార్హం. 

మూసీ ప్రక్షాళన, సుందరీకరణపై సమగ్ర మాస్టర్‌ప్లాన్‌ తయారు చేసి అమలు చేయాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ఈ ప్రణాళికల అమలుపై మూసీ కార్పొరేషన్, ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు.  

సమగ్ర మాస్టర్‌ప్లాన్‌ అత్యవసరం.. 
మహానగరానికి మణిహారంలా ఉన్న చారిత్రక మూసీనది ప్రక్షాళన, సుందరీకరణపై సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌ను సిద్ధం చేయాల్సి ఉంది. గృహ, వాణిజ్య, పారిశ్రామిక వాడల నుంచి వెలువడుతున్న మురుగునీరు ఈ నదిలో చేరకుండా ఇది ప్రవహించే మార్గానికి ఇరువైపులా రూ.3,865 కోట్ల అంచనా వ్యయంతో దశలవారీగా 31 ఎస్టీపీలను నూతనంగా నిర్మించాల్సి ఉంది. 

ఆయా పనులకోసం ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన పరమైన అనుమతులు జారీచేసింది. పనులు తక్షణం ప్రారంభించి ఏడాదిలోగా ఈపనులు పూర్తిచేయాల్సి ఉంది. ఇక సిటీలో నది ప్రవహించే మార్గంలో బాపూఘాట్‌– ప్రతాపసింగారం వరకు చేపట్టాల్సిన సుందరీకరణ పనులతోపాటు తీరైన రహదారులు, ఫ్లైఓవర్లు, నడకదారుల ఏర్పాటు, బోటింగ్‌ సదుపాయం కల్పించడం తదితర పనులపై సమగ్ర మాస్టర్‌ప్లాన్‌ను రూ.30 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. 

త్వరలోనే మహర్దశ  
మూసీకి మహార్ధశ తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చర్యలు ప్రారంభించింది. త్వరలో సమగ్ర మాస్టర్‌ప్లాన్‌ను సిద్ధంచేసి దాని ప్రకారం పనులు చేపడతాము. ఇటీవలి కాలంలో రూ.7 కోట్ల అంచనా వ్యయంతో మూసీ ప్రవాహ మార్గంలో తీరైన నడకదారులను అభివృద్ధి చేశాము. మూసీ ప్రవహించే మార్గాన్ని సమగ్ర సర్వే చేపట్టి...నీటి ప్రవాహానికి ఆటంకాలు తొలగించాము. 
– సుధీర్‌రెడ్డి, మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top