మన బడిని బాగు చేసుకుందాం

Telangana: Cabinet Sub Committee Holds Meet On Mana Ooru Mana Badi In MCRHRD - Sakshi

గ్రామాల సర్పంచ్‌లు, పూర్వ విద్యార్థులు కలిసి రావాలి 

మంత్రివర్గ ఉప సంఘం విజ్ఞప్తి 

జూన్‌ 12న పాఠశాలల పునఃప్రారంభం: మంత్రి సబిత 

ఆలోగా బడిబాట కార్యక్రమం పూర్తి 

ఆంగ్ల మాధ్యమంపై తల్లిదండ్రులకు అవగాహన 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. పాఠశాలలను బాగు చేసేందుకు గ్రామాల సర్పంచ్‌లు, పూర్వ విద్యార్థులు కలసి రావాలని కోరింది. మన ఊరు–మన బడిపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం శనివారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో భేటీ అయ్యింది. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ పాల్గొన్నారు. 

యుద్ధ ప్రాతిపదికన పాఠశాలల అభివృద్ధి పనులు 
పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచడం, డిజిటల్‌ విద్య, ఇంగ్లిష్‌ మీడియంలో బోధన తదితర అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ‘ప్రతి వారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి సమీక్షించడం ద్వారా యుద్ధ ప్రాతిపదికన పాఠశాలల అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి.

ప్రస్తుతం రాష్ట్రంలో సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా సంస్థలకు, ఇతర ప్రభుత్వ విద్యా సంస్థలకు ఒకే కరిక్యులమ్, ఒకే విధానం ఉండేలా చర్యలు తీసుకోవాలి. మే నెల ప్రారంభంలో పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా విద్యా సంస్థల్లో మొక్కలు, పచ్చదనాన్ని పెంచేందుకు రెండు మూడు రోజులు కేటాయించాలి..’అని నిర్ణయించారు.  

30 వేల పాఠశాలలకు బ్యాండ్‌విడ్త్‌ 
జూన్‌ 12న పాఠశాలలను పునఃప్రారంభిస్తామని, బడిబాట కార్యక్రమాన్ని జూన్‌ 1న ప్రారంభించి 12 తేదీ వరకు పూర్తి చేయాలని సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్న విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించాలని సూచించారు. త్వరలోనే టీ ఫైబర్‌ ద్వారా 30 వేల విద్యా సంస్థలకు బ్యాండ్‌విడ్త్‌ సౌకర్యాన్ని కల్పించబోతున్నట్లు తెలిపారు.

ఒక్కో పాఠశాలకు రూ. 50 వేలు: మంత్రి కేటీఆర్‌  
క్రీడలను ప్రోత్సహించేందుకు వీలుగా క్రీడా పరికరాల కొనుగోలుకు తన నియోజకవర్గ నిధుల నుంచి ఒక్కో పాఠశాలకు రూ. 50 వేల చొప్పున విడుదల చేయనున్నట్లు ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ విధంగా చేస్తే క్రీడా సౌకర్యాలు మెరుగుపడతాయన్నారు. పాఠశాలలు నడుస్తున్న ఆవరణలోనే ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉంటే వాటిని కూడా అభివృద్ధి సూచించారు.

ఈ పథకం కింద చేపట్టిన పనులు వేగవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యరద్శి రామకృష్ణారావు, ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, పాఠశాల విద్యా డైరెక్టర్‌ దేవసేన తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top