
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42శాతం రిజర్వేషన్‌తో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు తెలంగాణే కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈరోజు(గురువారం, జూలై 10) జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో పాటు ప్రతీ 15 రోజుకు ఒకసారి కేబినెట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ప్రతీ మూడు నెలలకు గత కేబినెట్ సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలపై పునః సమీక్ష చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
ఇది చరిత్రాత్మక నిర్ణయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ‘ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. 42 శాతం బిసి రిజర్వేషన్ల తోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విప్లవాత్మక అడుగు.. ఈ రోజు ప్రభుత్వం క్యాబినెట్ లో బిసి రిజర్వేషన్లు అమలు కోసం ఆర్డినెన్స్ తేవడానికి నిర్ణయం తీసుకోవడం స్వాగతిస్తున్నాం.
2018 చట్టాన్ని సవరించి బిసి రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం సామాజిక విప్లవానికి నాంది.. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జొడో యాత్రలో జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని చేసిన డిమాండ్ ను దేశంలో మొదటగా అమలు చేస్తున్నాం.. 42 శాతం బిసి రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి వర్గానికి పేరు పేరునా ధన్యవాదాలు. తెలంగాణ సమాజం, ప్రధానంగా బిసిలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలి’ అని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.