సొంత పన్నులు పైపైకి..

Telangana Budget 2023: 1. 31 Lakh Crore Allocated For Tax Revenue - Sakshi

2023–24లో రూ.1.31 లక్షల కోట్లు వస్తాయని అంచనా 

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.18,500 కోట్లు 

ఎక్సైజ్‌ ఆదాయం రూ.19,884 కోట్లు

అంతర్రాష్ట్ర సెటిల్‌మెంట్ల రూపంలో రూ.17,828 కోట్లు  

బహిరంగ మార్కెట్‌ రుణాలు రూ. 40,615 కోట్లు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం పన్నుల రాబడిలో స్వయం సమృద్ధి సాధిస్తోంది. ఏటేటా పెరుగుతున్న సొంత ఆదాయ వనరులే ధీమాగా ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌కు రూపకల్పన చేయడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. బడ్జెట్‌ గణాంకాలను పరిశీలిస్తే 2022–23 (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం)లో రాష్ట్ర పన్నుల కింద రూ.1.10 లక్షల కోట్లకు పైగా సమకూరగా, 2023–24కు ఇవి రూ.1.31 లక్షల కోట్లకు పెరగనున్నాయి.

ఇందులో ముఖ్యంగా ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల పద్దు కిందనే రూ.40వేల కోట్ల వరకు సమకూరనుండగా, ఎక్సైజ్‌ పద్దు కింద రూ.19,884 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.18,500 కోట్ల ఆదాయం రానున్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. దీనికితోడు రాష్ట్రంలో జరిగే వ్యాపారం, అమ్మకాల ద్వారా రూ.39,500 కోట్లు, వాహనాలపై పన్నుల ద్వారా రూ.7,512 కోట్లు సమకూరనున్నాయి. ఇతర ఆదాయాలతో కలిపితే మొత్తం రూ.1.31 లక్షల కోట్లు దాటుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.  

అప్పుల రూపంలో రూ. 46 వేల కోట్లు 
రెవెన్యూ రాబడుల కింద పరిగణించే అప్పుల రూపంలో రూ.46వేల కోట్లకు పైగా ప్రతిపాదించింది. ఇందులో బహిరంగ మార్కెట్‌లో తీసుకునే రుణాలు రూ.40,615 కోట్లు కాగా, కేంద్రం, ఇతర సంస్థల నుంచి మరో రూ.6 వేల కోట్లు తీసుకోనున్నట్టు ప్రతిపాదించింది. కాగా, అంతర్రాష్ట్ర సెటిల్‌మెంట్ల కింద ఈసారి బడ్జెట్‌ రాబడులను రూ. 17,828 కోట్ల కింద చూపెట్టారు.

ఈ నిధులు ఏపీ నుంచి రావాల్సి ఉందని, డిస్కంల కింద తమకు ఏపీ చెల్లించాల్సింది ఉందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ మొత్తాన్ని మంజూరు చేస్తే ఏపీ ఇచ్చినప్పుడు తిరిగి చెల్లిస్తామని ఇటీవల కేంద్రానికి రాసిన లేఖ మేరకు నిధులు వస్తాయనే అంచనాతో ఈ మొత్తాన్ని ప్రతిపాదించినట్లు పేర్కొంటున్నాయి. ఇదే పద్దు కింద 2022–23లో నిధులు చూపకపోయినా సవరించిన అంచనాల్లో అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారం కింద రూ.7,500 కోట్లు సమకూరినట్టు చూపడం గమనార్హం.

మూడేళ్ల క్రితం లక్ష కోట్లు 
సంవత్సరాలవారీగా లెక్కిస్తే రెవెన్యూ రాబడుల్లో గణనీయ వృద్ధి కనిపిస్తోందని బడ్జెట్‌ గణాంకాలు చెబుతున్నాయి. మూడేళ్ల క్రితం అంటే 2020–21లో అన్ని రకాల పన్నులు, ఆదాయాలు కలిపి రెవెన్యూ రాబడుల కింద ఖజానాకు రూ.లక్ష కోట్లు సమకూరితే 2023–24 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అవి రూ.2.16 లక్షల కోట్లకు చేరుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. 2021–22లో రూ.1.27 లక్షల కోట్లు రాగా, 2022–23 సవరించిన అంచనాల ప్రకారం రూ.1.75 లక్షల కోట్లు రానుండటం గమనార్హం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top