ప్రతీ అంశంపై సమగ్ర చర్చ జరగాలి: స్పీకర్‌ పోచారం

Telangana Assembly Speaker Pocharam Srinivasa Reddy Meeting On Upcoming Assembly Sessions - Sakshi

అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై సన్నాహక సమావేశంలో స్పీకర్‌ పోచారం

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ సమావేశాల్లో సభ హుందాతనం, ఔన్నత్యం కా­పాడుకుంటూ ప్రతీఅంశంపై సమగ్రంగా చర్చ జరగాలని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఏర్పాట్లపై మంగళవా­రం స్పీకర్‌ పోచారం, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అసెంబ్లీ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌­భాస్కర్, మండలి చీఫ్‌విప్‌ భానుప్రసాదరావు, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ వి.న­ర్సింహాచార్యులతోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని పో­చా­­రం అన్నా­రు. సమావేశాలు జరిగే రో­జు­ల్లో అధి­కారులు అందుబాటులో ఉం­డటంతో పా­టు ప్రతీశాఖ తరపున ఒక నోడల్‌ అధికారిని నియమించాలని ఆదేశించారు. 

జిల్లాల్లో ప్రొటోకాల్‌ వివాదాలు : మండలి చైర్మన్‌ గుత్తా 
జిల్లాల్లో ప్రొటోకాల్‌ అంశంలో ఇబ్బందులు వస్తున్నాయని, వివాదాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు. ఉభయసభలు సజావుగా నడిచేందుకు అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. గతంలో అసెంబ్లీ సగటున రోజుకు రెండుగంటల చొప్పున జరగ్గా, ప్రస్తుతం ఎనిమిదిగంటలపాటు జరుగుతోందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నోడల్‌అధికారి శాఖల వారీగా సమాచారం కోసం సమన్వయం చేసుకునేందుకు వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. స్పీకర్, మండలి చైర్మన్‌ సూచనలు పాటిస్తూ కొత్త ప్రొటోకాల్‌ బుక్‌ డ్రాఫ్ట్‌ తయారు చేయాల్సిందిగా అసెంబ్లీ కార్యదర్శికి సూచించారు.

శాసనసభ భవనంలో కొత్తగా ఏర్పాటు చేసిన రెండు లిఫ్ట్‌లను పోచారం శ్రీనివాసరెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డిలు ప్రారంభించారు. ఈ సమావేశంలో సీఎస్‌ శాంతికుమారి, ఆర్థిక, మున్సిపల్‌ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, అరి్వంద్‌కుమార్, డీజీపీ అంజనీకుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

అక్బరుద్దీన్‌తో మంత్రి వేముల భేటీ 
మంత్రి ప్రశాంత్‌రెడ్డి అసెంబ్లీ ఆవరణలోని ఎంఐఎం కార్యాలయంలో ఆ పార్టీ శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీతో భేటీ అయ్యారు. గంటన్నరపాటు ఇద్దరి మధ్య సమావేశం కొనసాగింది. ప్రస్తుతం అసెంబ్లీలో ఎంఐఎం ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.  

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top