
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం కొనసాగుతున్నాయి. దివంగత మాజీ ఎమ్మెల్యేలు మశ్చేందర్రావు, పి నర్సారెడ్డి, బిరుదు రాజమల్లుకు సభ సంతాపం తెలిపింది. అనంతరం హుక్కా సెంటర్లపై నిషేధానికి సంబంధించి సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ అమెండ్‌మెంట్ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరపున మంత్రి శ్రీధర్ బాబు సభలో ప్రవేశపెట్టారు. దీనిపై ఎలాంటి చర్చలేకుండానే బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ మేరకు స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. ఈ బిల్లు రాకతో ఇక నుంచి తెలంగాణలో హుక్కా సెంటర్లు మూతపడనున్నాయి. హుక్కా నిషేధం అమల్లోకి రానుంది.బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సిగరెట్ పొగ కంటే హుక్కా మరింత హానికరమని చెప్పారు. యువతకు హుక్కా వ్యసనమయ్యే అవకాశం ఉందన్నారు. బొగ్గు ఉపయోగించడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుందని దీన్ని సేవించే వారి వల్ల చుట్టుపక్కల వారికి కూడా ప్రమాదమని తెలిపారు. హుక్కా పార్లర్లపై నిషేధం అవసరమని సీఎం భావించారని పేర్కొన్నారు.
చదవండి: TS: అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ అప్‌డేట్స్