4 సవరణ బిల్లులకు ఆమోదం

Telangana Assembly Approves Four Amendment Bills - Sakshi

ప్రత్యేక భేటీ అనంతరం

శాసనసభ నిరవధిక వాయిదా

ఈ బిల్లులపై నేడు మండలిలో చర్చ

సాక్షి, హైదరాబాద్‌: నాలుగు ప్రభుత్వ బిల్లులకు ఆమోదం తెలిపిన రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశం నిరవధికంగా వాయిదా పడింది. రాష్ట్ర శాసనసభ ఆరో సమావేశం రెండో విడత భేటీని మంగళవారం ప్రత్యేకంగా నిర్వహించా రు. మంగళవారం ఉదయం 11.30కు ప్రారంభమైన సమావేశం ప్రశ్నోత్తరాలు వంటి ఇతర ఎజెండా ప్రస్తావన లేకుండా నేరుగా సవరణ బిల్లులపై చర్చను చేపట్టింది. భారతీయ స్టాంప్‌ (తెలంగాణ సవరణ) బిల్లు– 2020, తెలంగాణ వ్యవసాయ భూమి (వ్యవసాయేతర ప్రయోజనాల కోసం మార్పు) (సవరణ) బిల్లు– 2020ని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు తరఫున శాసనసభ వ్యవహా రాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రతిపాదించారు.

ఈ రెండు బిల్లులపై చర్చ సందర్భంగా ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, జాఫర్‌ హుస్సేన్, కాంగ్రెస్‌ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క పలు సూచనలు చేశారు. హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (సవరణ) బిల్లు– 2020ని మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ప్రతిపాదించగా, అహ్మద్‌ బలాలా (ఎంఐఎం), భట్టి విక్రమార్క (కాంగ్రెస్‌) తో పాటు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద్‌ గౌడ్, సుధీర్‌రెడ్డి చర్చలో పాల్గొన్నారు. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (తెలంగాణ) సవరణ బిల్లు– 2020ని న్యాయశాఖ మంత్రి ఏ.ఇంద్రకరణ్‌రెడ్డి ప్రతిపాదించారు.

నాలుగు బిల్లులను సభ ఆమోదించినట్లు ప్రకటించిన స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శాసనసభను నిరవధికంగా వాయిదా వేశారు. మంగళవారం ఉదయం సభ ప్రారంభ సమయంలో సమావేశ మందిరంలోకి వచ్చిన సీఎం కేసీఆర్‌ ఐదు నిమిషాల పాటు సభలో ఉన్నారు. సమావేశం వాయిదాకు ముందే పలువురు శాసనసభ్యులు తిరుగుముఖం పట్టారు. కాగా, శాసనసభ ఆమోదించిన నాలుగు సవరణ బిల్లులపై చర్చించేందుకు బుధవారం శాసనమండలి ప్రత్యేక భేటీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ బిల్లులపై చర్చించి ఆమోదం తెలిపిన తర్వాత శాసనమండలిని నిరవధికంగా వాయిదా వేస్తూ చైర్మన్‌ ప్రకటన చేస్తారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top