
రూ.4,023 కోట్ల లోటుతో ప్రారంభమైన 2025–26 ఆర్థిక సంవత్సరం
అప్పులతో కలిపి ఏప్రిల్‌లో రాబడులు రూ.16,473.99 కోట్లు మాత్రమే
ఏప్రిల్‌లో పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం రూ.10,916.68 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక ముఖచిత్రాన్ని వెల్లడించిన కాగ్ నివేదిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త ఆర్థిక సంవత్సరం భారీ ద్రవ్యలోటుతో ప్రారంభమైంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో తొలి మాసమైన 2025, ఏప్రిల్ నెలలో రూ.4,023.11 కోట్ల ద్రవ్యలోటు నమోదైనట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక స్పష్టం చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలలో రూ.1,020 కోట్ల ద్రవ్య మిగులుతో ప్రారంభం కావడం గమనార్హం.
ఈ ఏడాది ఏప్రిల్‌లో పన్ను రాబడులు అంతంత మాత్రంగానే ఉన్నాయని కాగ్ నివేదిక చెబుతోంది. ఆ నెలలో రూ.10,916.68 కోట్లు పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యాయి. గత ఏడాది ఏప్రిల్ నెలలో పన్నుల రూపంలో రూ.11.464.17 కోట్లు వచ్చాయి. అయితే, ఈ ఏడాది అప్పులతో కలిపి ఏప్రిల్‌లో రూ.16,473.99 కోట్లు వచ్చాయి. ఇందులో అప్పు రూ. 5,230.99 కోట్లు.

ఖర్చులు అనివార్యం
ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభ నెలలో రెవెన్యూ ఖర్చు రూ.15,262 కోట్లుగా నమోదైంది. ఇందులో గత అప్పులకు వడ్డీల చెల్లింపులు రూ.2,260 కోట్లు, వేతనాలకు రూ.3,968 కోట్లు, పింఛన్ల రూపంలో రూ.1,569 కోట్లు, సబ్సిడీల కింద రూ.4,187 కోట్లు, రెవెన్యూ పద్దు కింద రూ.3,275 కోట్లు ఖర్చయ్యాయి. మూలధన వ్యయం కింద రూ.1,204 కోట్లు కలిపి మొత్తం ఖర్చు రూ.16,466.63 కోట్లుగా నమోదైంది.