
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జల విద్యుత్ ప్లాంట్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగులకు తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నివాళులు అర్పించింది. కొవ్వొత్తులు వెలిగించి, మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివాజీ మాట్లాడుతూ.. ‘తెలంగాణ జెన్‌కోలో 20వ తేదీన అనుకోకుండా జరిగిన షార్ట్ సర్క్యూట్‌తో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. వాళ్ళు ప్రాణాలు పణంగా పెట్టి ప్లాంట్ కాపాడాలని చూశారు. యువ ఇంజనీర్‌లు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు 2 కోట్ల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎండిని కోరుతున్నాం. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
సోమవారం ఉదయం సీఎండీని కలిసి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని కోరాం. వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటామని మా ఉద్యోగులు చాలా మంది ముందుకు వస్తున్నారు. ఎమర్జెన్సీ కండిషన్‌లో కూడా మా విద్యుత్ ఉద్యోగులు నిరంతరం పని చేస్తున్నారు. ఇలాంటివి భవిష్యత్తులో జరుగకూడదు అని కోరుకుంటున్నాం. ఆగస్టు 21వ తేదీని విద్యుత్ ఉద్యోగుల అమరుల వీరుల దినోత్సవం ప్రకటించాలని కోరుతున్నాం. ఇదే చివరి ఘటన కావాలని ఆశిస్తున్నాం’ అని తెలిపారు.