
వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య
విద్యార్థుల ఆప్షన్ల డేటా మొత్తం తారుమారు!
ఆగిపోయిన సీట్ల కేటాయింపు ప్రక్రియ
షెడ్యూల్ ప్రకారం శుక్రవారమే ఇవ్వాలి
శనివారం రాత్రి వరకూ పత్తాలేని ప్రకటన
నోరు విప్పని అధికారులు.. అంతా గందరగోళం
ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కూడా డౌటే
శనివారం వరకూ వెబ్‌సైట్‌లో కనిపించని కాలేజీలు
షెడ్యూల్ ప్రకారం నేటి నుంచే ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాంకేతిక విద్య విభాగంలో గందరగోళం నెలకొంది. పాలిసెట్ సీట్ల కేటాయింపు ఆగిపోయింది. ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఏం జరుగుతుందో తెలియని స్థితి ఏర్పడింది. విషయం తెలుసుకునేందుకు మీడియా శనివారం రాత్రి వరకూ ప్రయత్నించినా అధికారులెవరూ అందుబాటులోకి రాలేదు.
కిందిస్థాయి సిబ్బంది కూడా అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఒకరిద్దరు మాత్రం సాఫ్ట్‌వేర్‌లో ఏదో సమస్య వచ్చిందని తెలిపారు. మరికొందరు వెబ్‌సైట్‌లో విద్యార్థుల డేటా మొత్తం ఎగిరిపోయిందని చెప్పారు. తాము చెప్పినట్టు ఎవరికీ చెప్పొద్దంటూ వారు వేడుకున్నారు. దీన్నిబట్టి సరిదిద్దలేని తప్పులేవో సాంకేతిక విద్య విభాగంలో జరిగినట్టు తెలుస్తోంది.
పాలిసెట్ సీట్ల కేటాయింపు ఏమైంది?
పాలిసెట్ సీట్ల కేటాయింపు ఈ నెల 4వ తేదీనే ఉంటుందని కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో సాంకేతిక విద్యా మండలి ప్రకటించింది. కానీ 4వ తేదీ రాత్రివరకూ ప్రకటించలేదు. కౌన్సెలింగ్ క్యాంపు అధికారులను వివరణ కోరితే పాలనాపరమైన అనుమతులు రావాల్సి ఉందని ఒకసారి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టత రావాల్సి ఉందని మరోసారి బదులిచ్చారు. శనివారం ఉదయమే సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు.
పాలిటెక్నిక్ సీట్ల కోసం దాదాపు 22 వేల మంది ఎదురు చూస్తున్నారు. శనివారం రాత్రివరకు సీట్లు ఖరారు చేయలేదు. దీనిపై అధికారులు స్పందించడం లేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం వేల మంది విద్యార్థుల డేటా తారుమారైనట్టు తెలిసింది. సర్వర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు సమాచారం.
విద్యార్థులు వెబ్‌సైట్‌లో పెట్టిన ఆప్షన్లు మొత్తం మారిపోయినట్టు తెలిసింది. దీనిపై సిబ్బంది, అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడం, ఇది ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సమస్య మరింత జటిలమైందని తెలియవచ్చింది. సిబ్బంది అజాగ్రత్తే దీనికి కారణమని తెలుస్తోంది. దీనివల్లే సీట్ల కేటాయింపు ఆగిపోయినట్టు సమాచారం.
ఇంజనీరింగ్ కథేంటి?
ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు ఆదివారం నుంచి మొదలవ్వాలి. అన్ని యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు కాలేజీలు, సీట్లు, కోర్సుల వివరాలను ప్రభుత్వానికి పంపాయి. ఎక్కువ ప్రైవేటు కాలేజీలున్న జేఎన్టీయూహెచ్ కూడా శనివారం మధ్యాహ్నం గుర్తింపు వివరాలన్నీ సాంకేతిక విద్యా మండలి కార్యాలయానికి పంపింది. వీటిని అప్‌లోడ్ చేస్తేనే విద్యార్థులు ఆదివారం ఉదయం నుంచి వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి వీలుంటుంది.
కానీ, శనివారం రాత్రి పొద్దుపోయే వరకు ఈ ప్రక్రియ పూర్తవ్వకపోవడంతో అసలు వెబ్ ఆప్షన్లు ఉంటాయా? షెడ్యూల్‌ను అనుసరిస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతిక విద్య ఉన్నతాధికారి, ఎప్‌సెట్ క్యాంప్ అధికారి, జేఎన్టీయూహెచ్ రిజి్రస్టార్ శనివారం ఉదయం 11 గంటల నుంచే విద్యాశాఖ కార్యదర్శి వద్ద సమావేశమయ్యారు.
పాలిసెట్ డేటా గందరగోళం అవ్వడంపై కొంత సీరియస్‌గానే చర్చ జరిగినట్టు తెలిసింది. ఆ తర్వాత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌పై గంటల తరబడి చర్చించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆ తర్వాత శనివారం రాత్రి ముఖ్యమంత్రి నివాసానికి అధికారులు వెళ్లి చాలా సమయం చర్చించడంతో అసలేం జరుగుతోందనే ఆసక్తి నెలకొంది.