
టాప్ ర్యాంకుల్లో బాలికలదే పైచేయి
ఫలితాలు విడుదల చేసిన దేవసేన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పాలిసెట్‌లో 83,364 (88.54 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీ విభాగంలో 81.88%, ఎంబైపీసీ విభాగంలో 84.33% అర్హత సాధించారు. టాప్ ర్యాంకుల్లో ఎక్కువ మంది బాలికలే ఉండటం విశేషం. 120 మార్కుల పేపర్‌లో నలుగురు విద్యార్థులు పూర్తి మార్కులు 120 సాధించటం గమనార్హం. పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశానికి సాంకేతిక విద్య, శిక్షణ మండలి ఈ నెల 13న రాష్ట్రవ్యాప్తంగా పాలిసెట్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్ష ఫలితాలను సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన శనివారం విడుదల చేశారు.
పరీక్షకు మొత్తం 1,06,716 మంది దరఖాస్తు చేయగా, 98,858 మంది పరీక్ష రాశారు. వీరిలో 83,364 మంది అర్హత సాధించారు. ఎంపీసీ విభాగంలో మొత్తం 80,949 మంది అర్హత సాధించగా, వారిలో బాలురు 41,923 మంది, బాలికలు 39,026 మంది ఉన్నారు. ఎంబైపీసీ విభాగంలో బాలురు 42,836, బాలికలు 40,528 మంది కలిపి మొత్తంగా 83,364 మంది అర్హత సాధించారు.
మొత్తం 120 మార్కులకు నిర్వహించిన పరీక్షలో అర్హత మార్కులు 36. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు ఒక్క మార్కు వచ్చినా అర్హతగా పరిగణిస్తారు. పాలిసెట్ ర్యాంకు కార్డులను ఎస్‌బీటీఈటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని దేవసేన తెలిపారు. ప్రవేశ ప్రకటన వెలువడిన తర్వాత విద్యార్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరవ్వాలని ఆమె సూచించారు.
లక్ష్యంతో చదివా
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాఠశాల స్థాయి నుంచి పాలిసెట్‌లో ర్యాంకు సాధించాలనే లక్ష్యంతో చదివాను. ఎస్సెస్సీలో 574 మార్కులు సాధించాను. ఫిజిక్స్, మేథ్స్ సబ్జెక్టులు నాకు ఎక్కువ ఇష్టం. భవిష్యత్‌లో ఐఐటీలో మంచి సీటు సాధించి, ఇంజనీర్ కావాలన్న లక్ష్యంతో చదువుతున్నాను. ర్యాంకు సాధించేందుకు సహకరించిన పాఠశాల ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. – ఉంద్యాల కౌశిక్‌నారాయణ, 1వ ర్యాంకర్
సివిల్స్ సాధించడమే లక్ష్యం
కోదాడ: భవిష్యత్తులో సివిల్స్ సాధించడమే నా లక్ష్యం. ఐఐటీలో ఇంజనీరింగ్ చదువుతా. తరువాత సివిల్స్‌పై దృష్టి సారిస్తా. టీజీఎస్‌ఆర్‌జేసీలో కూడా నాలుగో ర్యాంకు సాధించాను. పాఠశాల యాజమాన్యం, నా తండ్రి జానీపాషా ప్రోత్సాహంతో ఈ ర్యాంకులు సాధించాను. – ఎస్.కె. ఇఫ్రా తస్నీమ్, 3వ ర్యాంకర్
ఆదిలాబాద్ విద్యార్థికి 5వ ర్యాంకు
నేరడిగొండ: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్–2025 ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం సవర్గామ్ గ్రామానికి చెందిన జాదవ్ రిషి ఆరాధ్య రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించింది. ఈమె తండ్రి జె.తానాజీ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.
ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యం
సూర్యాపేట టౌన్: పాలిసెట్‌లో రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంకు రావడం సంతోషాన్నిచ్చింది. నాన్న మధుసూదన్‌రావు, అమ్మ సునీత ప్రోత్సాహంతోనే ఈ ర్యాంకు సాధించగలిగాను. టీచర్లు కూడా ప్రోత్సహించి మంచి విద్యనందించారు. ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యంగా చదువుతున్నాను. అలాగే భవిష్యత్తులో సివిల్స్ కూడా సాధించాలనేది నా కోరిక. –గోరుగంటి శ్రీజ, 1వ ర్యాంకర్