
సాక్షి, పాల్వంచ: వారిద్దరూ టీచర్లుగా పనిచేస్తున్నారు.. ఆమె భర్తకు దూరమైంది. అతడికి భార్య లేదు. దీంతో, రెండు కుటుంబాల పెద్దలు వారిద్దిరికీ పెళ్లి కుదిర్చారు. జీవితంలో రెండో అధ్యాయాన్ని ప్రారంభించాలనుకున్న ఈ జంటకు ఊహించని పరిణామం ఎదురైంది. పెళ్లి వేడుకకు వచ్చిన మరో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ‘ఆపండి... నేను ఆమెను ఇష్టపడ్డాను.. నేనే పెళ్లి చేసుకుంటాను’ అంటూ గందరగోళం సృష్టించడంతో పెళ్లి ఆగిపోయింది. ఈ వింత ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. పాల్వంచకు చెందిన 29 ఏళ్ల మహిళ స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఐదేళ్ల క్రితం ఆమెకు వివాహం జరిగింది. ఆమెకు ఓ పాప కూడా ఉంది. అయితే, కొన్నాళ్లకు భర్తతో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం స్థానిక ప్రైవేటు స్కూల్లో పనిచేస్తోంది. మరోవైపు, ఖమ్మంలో పనిచేస్తున్న 33 ఏళ్ల ప్రభుత్వ ఉపాధ్యాయుడితో ఆమెకు రెండో వివాహం నిశ్చయించారు. పెళ్లయిన కొన్నాళ్లకే అతని భార్య చనిపోయింది. ఆయనకు కూడా ఇది రెండో వివాహం. ఇరు కుటుంబాల పెద్దలు వీరిద్దరికీ వివాహం జరిపించాలని నిశ్చయించారు. శనివారం సాయంత్రం పాల్వంచలోని ఓ ప్రార్థనా మందిరంలో పెళ్లి వేడుకకు అన్ని ఏర్పాట్లు చేశారు.
కాసేపట్లో పెళ్లి అయిపోతుందన్న సమయంలో మరో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎంట్రీ ఇచ్చాడు. ఒక్కసారిగా.. నాకు వధువు అంటే ఇష్టం. ప్రైవేటు స్కూల్‌లో పనిచేసేటప్పుడు వధువుతో పరిచయం ఏర్పడింది. నాకు పెళ్లయినా పిల్లలు పుట్టలేదు. నా భార్యకు విడాకులిచ్చి ఈమెను పెళ్లాడతా అంటూ రచ్చ చేశాడు. ఈ సందర్భంగా వధువు మాట్లాడుతూ.. అతడు గతంలో బతిమిలాడగా తల్లిదండ్రులు చూసిన సంబంధమే చేసుకుంటానని చెప్పాను. దాన్ని మనసులో పెట్టుకుని ఇలా చేస్తున్నాడని చెప్పుకొచ్చింది. అలాగే, ఆమెతో వివాహేతర సంబంధమున్నట్లు వరుడికి సైతం ఒకసారి ఫోన్ చేయడం గమనార్హం. ఈ క్రమంలో అతడిని పట్టుకునేలోపే అక్కడి నుంచి నిందితుడు పారిపోయాడు. ఈ రచ్చ కారణంగా వరుడితోపాటు అతడి బంధువులు వెళ్లిపోవడంతో వివాహం ఆగిపోయింది. అనంతరం, యువతి, ఆమె కుటుంబ పోలీసులను ఆశ్రయించారు. అతడితో ఫిర్యాదు చేశారు.