షెడ్యూల్‌ ఇవ్వకుండానే.. సైలెంట్‌గా టీచర్ల పదోన్నతుల జాబితాలు!

Teachers Promotions in Telangana Without Schedule - Sakshi

షెడ్యూల్‌ ఇవ్వకుండానే టీచర్‌ ప్రమోషన్ల తంతు 

అదికూడా ఎస్జీటీలు, ఎస్‌ఏలకే పరిమితం

గోప్యతపై ఉపాధ్యాయుల సందేహాలు 

బదిలీల ప్రక్రియ సంగతేమిటనే ప్రశ్నలు 

ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్న సంఘాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులపై మళ్లీ కదలిక వచ్చింది. సీనియారిటీ జాబితాలు సిద్ధం చేయాలని పాఠశాల విద్య డైరెక్టరేట్‌ నుంచి జిల్లాలకు ఆదేశాలు వెళ్లాయి. ఈ మేరకు మండల, జిల్లా విద్యాశాఖ అధికారులు సీనియారిటీ ప్రాతిపదికన జాబితాలు సిద్ధం చేస్తున్నారు. వాటిని అనధికారికంగా ఉపాధ్యాయ సంఘాల వాట్సాప్‌లకు పంపి.. డ్రాఫ్ట్‌ (ముసాయిదా జాబితా)గా భావించాలని చెప్తున్నారు. అయితే ఈ పదోన్నతుల జాబితాల్లో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ)లు, స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ) మాత్రమే ఉండటంతో ఉపాధ్యాయుల్లో కలవరం మొదలైంది. షెడ్యూల్‌ విడుదల చేయకుండానే ముసాయిదా సీనియారిటీ జాబితాలు రూపొందించడం ఏమిటని.. అందరికీ పదోన్నతులు ఇవ్వడంపై విద్యాశాఖ ఎందుకు దృష్టిపెట్టడం లేదని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. పదోన్నతులు, బదిలీలపై ఉన్న చిక్కులన్నీ పరిష్కరించాలని కోరుతున్నాయి. ఈ వ్యవహారంపై ఆందోళనబాట పట్టాలని పలు సంఘాలు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. 

పర్యవేక్షణ పోస్టులు లేనట్టేనా? 
రాష్ట్రవ్యాప్తంగా 1.05 లక్షల మంది టీచర్లున్నారు. ఇందులో ఎస్జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌గా పదో న్నతి పొందాల్సినవారు 8,500 మంది ఉంటారు. స్కూల్‌ అసిస్టెంట్‌ నుంచి హెడ్‌మాస్టర్‌(హెచ్‌ఎం) గా ప్రమోషన్‌ పొందాల్సినవారు 2 వేలకుపైగా ఉం టారు. వీరికి పదోన్నతులు కల్పించడంపై ఎలాంటి చిక్కులూ లేవని అధికార వర్గాలు అంటున్నాయి. అయితే హెచ్‌ఎంల నుంచి ఎంఈవోలు, డిప్యూటీ డీఈవోలుగా పదోన్నతులు కల్పించడమే సమస్య అంటున్నాయి. పంచాయతీరాజ్‌ వ్యవస్థ కింద ఉన్న టీచర్లకూ ఎంఈవో, డిప్యూటీ డీఈవో పోస్టులు ఇవ్వాలని సంఘాలు పట్టుబడుతున్నాయి. మరోవైపు నిబంధనల ప్రకారం విద్యాశాఖ నేరుగా రిక్రూ ట్‌చేసుకున్న ప్రభుత్వ స్కూళ్ల ఉపాధ్యాయులకే ఆ పోస్టులు ఇవ్వాలని ప్రభుత్వ ఉపాధ్యాయుల సం ఘం స్పష్టంచేస్తోంది. దీనిపై విద్యామంత్రి వద్ద రెండుసార్లు చర్చలు జరిగాయి. అయినా ఏమీ తేల లేదు. ఈ కారణంతో ప్రస్తుతం హెచ్‌ఎంలకు పదో న్నతులు కల్పించే అవకాశం లేదని భావిస్తున్నారు. 

జాబితాలు అందరికీ పంపాలి 
షెడ్యూల్‌ ఇవ్వకుండానే పదోన్నతులకు సంబంధించి జాబితాలు సిద్ధం చేయడం సరికాదు. టీచర్లు అందరికీ జాబితాలు పంపకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ముందు పదోన్నతులు, బదిలీలకు ఉన్న కోర్టు చిక్కులు, ఇతర సమస్యలను పరిష్కరించాలి. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. 
–చావ రవి, యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 

హెచ్‌ఎంల పదోన్నతులూ ముఖ్యమే 
రాష్ట్రవ్యాప్తంగా ఎంఈవోలు, డిప్యూటీ డీఈవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనివల్ల విద్యావ్యవస్థ సక్రమంగా పనిచేయడం కష్టం. సాకులు చూపి పదోన్నతులు, బదిలీలు చేపట్టకపోవడం సరికాదు. ప్రధానోపాధ్యాయులు ఎంతోకాలంగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇంకా వాయిదా వేస్తే వారిలో సహనం నశిస్తుంది. 
–పి.రాజాభాను చంద్రప్రకాశ్, ప్రభుత్వ 
గెజిటెడ్‌ హెచ్‌ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు  

బదిలీలకూ సమస్యే.. 
పదోన్నతులు, బదిలీలను ఏకకాలంలో చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ అన్నిస్థాయిల్లో పదోన్నతుల ప్రక్రియ పూర్తయితే తప్ప బదిలీలు చేయడం సాధ్యమయ్యే పనికాదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ఈ నెల 23 నుంచి జూన్‌ 1 వరకు టెన్త్‌ పరీక్షలు జరగనున్నాయి. దీంతో ఆ తర్వాత ప్రమోషన్లు, బదిలీలు చేపట్టాలని.. ఏప్రిల్‌ నెలాఖరుకే ఈ మేరకు షెడ్యూల్‌ ఇవ్వాలని విద్యాశాఖ భావించింది. కానీ ఈ ప్రక్రియకు ఏదో అడ్డంకి వస్తుండటంతో.. ప్రస్తుతం ఎస్జీటీలు, స్కూల్‌ అసిస్టెంట్ల పదోన్నతులు మాత్రమే చేపట్టాలని నిర్ణయించింది. ఇలాగైతే బదిలీలు ఎప్పుడు చేపడతారని, ఎలా చేస్తారని ఉపాధ్యాయ సంఘాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. జూన్‌లో బడుల రీఓపెనింగ్‌ ఉంటుందని... ఇప్పటికీ పదోన్నతులపై స్పష్టత ఇవ్వకుండా, కోర్టు వివాదాలు, ఇతర సమస్యలను తేల్చకుండా బదిలీలు ఎలా చేపడతారని ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే 317 జీవోకు సంబంధించి 6 వేల అప్పీళ్లు విద్యాశాఖ ముందున్నాయని.. స్పౌజ్‌ కేసులను పరిష్కరించలేదని గుర్తు చేస్తున్నాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top