చంటి లోకల్‌! అనే సినీ డైలాగ్‌తో వసూళ్లు..నివ్వెరపోయిన పోలీసులు

Task Force Involved In Irregularities At Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌ క్రైం: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో జరిగిన అక్రమాలపై ఉక్కుపాదం మోపేది టాస్క్‌ఫోర్స్‌.. కానీ ఆ విభాగంలోని అధికారుల్లో కొందరు అవే అక్రమాలకు పాల్పడడం... విచారణలో తెలిసిన విషయాలు చూసి నివ్వెరపోయిన పోలీస్‌ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ నలుగురిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఈ విషయం కమిషరేట్‌లో కలకలం రేపింది.

టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.నరేష్‌కుమార్, హెడ్‌ కానిస్టేబుళ్లు పి.శ్యాంసుందర్, కె.సోమలింగం, కానిస్టేబుల్‌ బి.సృజన్‌లు బియ్యం దందాతోపాటు మ రికొన్నింట్లో అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు తేలడంతో సస్పెండ్‌ చేస్తూ సీపీ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్‌ 3న పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఏవీ రంగనాథ్‌ ముందుగా సొంతింటిని చక్కబెట్టుకోవడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

అక్రమ వసూళ్లకు వారే సూత్రధారులు 
వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పడినప్పటినుంచి కొంతమంది సిబ్బందికి ఎలాంటి బదిలీలు లేవు. దీంతో శాఖలోని లొసుగులను ఆసరా చేసుకుని వసూళ్లకు తెరలేపినట్లు సమాచారం. ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించి టాస్క్‌ ఫోర్స్‌ను అడ్డుపెట్టుకుని సస్పెన్షన్‌కు గురైన ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ ఏకంగా లక్షల రూపాయల వసూళ్లకు పా ల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆ కానిస్టేబుల్‌కు రూ.10వేల కంటే తక్కువ ఇస్తే వాటిని ముఖంపై విసిరికొట్టేవాడని చెబుతుండేవారు. కొంతకాలంగా వీరిపై వస్తున్న వసూళ్ల ఆరోపణలపై దృష్టి సారించిన సీపీ రంగనాథ్‌ ఆ దిశగా విచారణ జరిపారు. కొందరు అధికారుల అవినీతి బయటపడుతుందని ఆశించిన వారికి టాస్క్‌ఫోర్స్‌లో అది వెలుగుచూడడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. రెండు బృందాల్లోని టాస్క్‌ఫోర్స్‌లో కీలకంగా పనిచేసిన ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్లు ఒకేసారి సస్పెండ్‌ కావడం చూస్తుంటే ఏ స్థాయిలో వసూళ్లు జరిగాయో అర్థం చేసుకోవచ్చు.

వారం రోజుల విచారణ...నలుగురిపై వేటు
పీడీఎస్‌ బియ్యం దందాపై జరిగిన విచారణలో భా గంగా హసన్‌పర్తికి చెందిన ఓ బియ్యం వ్యాపారి, మిల్స్‌కాలనీ పీఎస్‌ పరిధిలో ఉండే మరో వ్యాపారి, ఓ రిపోర్టర్‌ను వారం రోజులపాటు విచారించడంతో నిజాలు వెలుగుచూసినట్లు తెలిసింది. మామూ ళ్ల వసూళ్లలో కమిషనరేట్‌కు చెందిన అధికారులు పెద్ద సంఖ్యలో ఉండడం గమనార్హం. వరుస సస్పెన్షన్‌ వేట్లతో ఉరికిస్తున్న సీపీ.. రానున్న రోజుల్లో ఎవరిపై చర్యలు హాట్‌టాపిక్‌గా మారింది. 

చంటి లోకల్‌.. వసూళ్ల సూత్రధారి ఓ రిపోర్టర్‌ 
వేటుపడిన టాస్క్‌ఫోర్స్‌ అధికారి ఉన్నతాధికారుల ముందు ‘చంటి లోకల్‌...అధికారులు వస్తారు...పోతారు’ అనే సినిమా డైలాగ్‌ను పదేపదే చెప్పడంతోపాటు తనకు ఓ ఎమ్మెల్యే అండ ఉందని, తనను ఎవరు ఏమీ చేయరనే ధైర్యంతో వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రతినెలా లక్షల రూపాయల వరకు వసూళ్లకు పాల్పడినట్లు తెలిసింది. వరంగల్‌ ప్రాంతంలో ఓ యూ ట్యూబ్‌ రిపోర్టర్‌ను మధ్యవర్తిగా పెట్టుకుని పెద్ద మొత్తంలో వసూలు చేసినట్లు విచారణలో వెలుగు చూసింది.  

(చదవండి: మానవత్వంలో ‘రాజా’రాం... )

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top