‘లీక్‌’పై రాజ్యాంగ పరిధిలో చర్యలు తీసుకోండి

Take constitutional action against Exam Paper leak - Sakshi

గవర్నర్‌ తమిళిసైకు బీజేపీ టాస్‌్కఫోర్స్‌ కమిటీ విజ్ఞప్తి 

రాజ్‌భవన్‌కు వెళ్లిన ఈటల రాజేందర్‌ నేతృత్వంలోని బృందం 

టీఎస్‌పీఎస్సీ వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి 

నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష చొప్పున పరిహారమివ్వాలి 

ఈ దిశగా తగిన విధంగా స్పందించాలంటూ వినతిపత్రం 

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ కారకులు, దీని వెనుక ఉన్న వారిపై రాజ్యాంగపరిధిలో అవసరమైన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు బీజేపీ ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది. ఈ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని.. కమిషన్‌ చైర్మన్, సభ్యులను తొలగించి కొత్త బోర్డును నియమించే దిశలో తగిన విధంగా స్పందించాలని కోరింది. టీఎస్‌పీఎస్సీ అధికారుల కుమ్మక్కుతోనే ప్రశ్నపత్రాలు బయటికి వచ్చి నట్టుగా అనుమానాలు ఉన్నా­యని వివరించింది.

ఈ మేరకు శనివారం బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్‌ నేతృత్వంలో పేపర్‌ లీకేజీపై పార్టీ ఏర్పాటు చేసుకున్న టాస్‌్కఫోర్స్‌ కమిటీ కన్వినర్, టీఎస్‌పీఎస్సీ మాజీ సభ్యుడు సీహెచ్‌ విఠల్, సభ్యులు మాజీ ఐఏఎస్‌ చంద్రవదన్, మాజీ ఐపీఎస్‌ కృష్ణప్రసాద్, ఎమ్మెల్సీ ఏవీఎన్‌ రెడ్డి, పార్టీ నేతలు ఎన్‌.రామచంద్రరావు, మర్రి శశిధర్‌రెడ్డి, బూరనర్సయ్య­గౌడ్‌ తదితరులు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు.

సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోనే టీఎస్‌పీఎస్సీ పనిచేస్తున్నందున లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని.. ఐటీ సెక్యూరిటీ ప్రోటోకాల్స్‌ వైఫల్యంతో లీకేజీకి ఆస్కారం ఏర్పడినందున ఐటీ మంత్రి కేటీఆర్‌ రాజీనామా చేయాలని తమ డిమాండ్లలో పేర్కొన్నారు. వివిధ పరీక్షలు రాసి నష్టపోయిన నిరుద్యోగ యువతకు రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లించాలన్నారు. 

యువత బరిగీసి కొట్లాడాలి: ఈటల 
పేపర్‌ లీకేజీ నేపథ్యంలో యువత మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవద్దని.. ధైర్యంగా బరిగీసి కొట్లాడాలని ఈటల రాజేందర్‌ విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులపక్షాన బీజేపీ నిలుస్తుందని, అందరం కలసి ప్రభుత్వం మెడలు వంచుదామని పేర్కొన్నారు.

రద్దయిన పరీక్షలను వెంటనే నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ విద్యార్థుల కళ్లలో మట్టికొట్టారని మండిపడ్డారు. రద్దయిన పరీక్షలు రాసిన ప్రతి విద్యా­ర్థి మళ్లీ ప్రిపేర్‌ కావడానికి ప్రభుత్వమే రూ.­లక్ష చొప్పున సాయం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top