కామినేని ఆస్పత్రిలో ఠాగూర్‌ సినిమా సీన్‌ రిపీట్‌.. అసలేం జరిగింది?

Tagore Scene Repeat Doctors Treatment To Died Patient At  LB Nagar Hospital - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం మృతిచెందిన వ్యకికి చికిత్సను అందించి ఠాగూర్‌ సినిమాలోని సీన్‌ను తలపించేలా ఎల్‌బీనగర్‌ కామినేని హాస్పిటల్స్‌ వ్యవహరించిందని మృతుని కుటుంబసభ్యులు గురువారం రాత్రి హాస్పిటల్‌ ఎదుట ఆందోళన చేశారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... స్టేషన్‌ ఘన్‌పూర్‌కు చెందిన మునుగెల శివకృష్ణ(35) సూర్యాపేటలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో లోన్‌ రికవరీగా ఉద్యోగం చేస్తూ భార్య ఉమా పిల్లలు అక్షత, కన్నయ్యలతో కలిసి అక్కడే నివసిస్తున్నాడు.

శివకృష్ణకు గుండెపోటు రావటంతో కుటుంబ సభ్యులు సూర్యాపేట నుంచి నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తరలించారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషయమంగా ఉందని ఎల్‌బీనగర్‌ కామినేని హాస్పిటల్స్‌కు తరలించాలని సూచించారు. వెంటనే అదేరోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో శివకృష్ణను ఎల్‌బీనగర్‌ కామినేని హాస్పిటల్స్‌కు తీసుకొచ్చారు. పరీక్షించిన ఎల్‌బీనగర్‌ కామినేని వైద్యులు అడ్మిట్‌ చేసుకున్నారు. గుండె నాళాలు మూసుకుపోయాయని మూడు స్టట్స్‌ వేయాలని వైద్యులు చేప్పడంతో వేయమని చెప్పామన్నారు.

శివకృష్ణకు ఇన్సూరెన్స్‌ కార్డు ఉన్నా ఇంకా అప్రూవల్‌ రాలేదని డబ్బులు చెల్లించాలని పేర్కొనడంతో డబ్బులు చెల్లించారు. రోగి పరిస్థితి విషమంగా ఉందని కిడ్నీలు చెడిపోయాయని, డయాలసిస్‌ చేస్తున్నామని వైద్యులు తెలిపారన్నారు. డబ్బులు చెల్లించాలని ఆస్పత్రి వర్గాలు ఒత్తిడి చేయడంతో రూ. 7లక్షలు చెల్లించామని ఇంకా డబ్బులు చెల్లించలేమని, రోగిని నిమ్స్‌కు తీసుకెళ్లామని బంధువుల పేర్కొనగా... రెండు రోజులుగా రోగిని బంధువులకు చూపించకుండా, రోగి పరిస్థితి కుటుంబసభ్యులకు తెలుపకుండా గుట్టుగా ఉంచారని ఆరోపించారు.

గురువారం ఉదయం నుంచి రోగి బంధువులు, కుటుంబ సభ్యులు షిఫ్ట్‌ చేస్తామని మరింత ఒత్తిడి చేశారు. రాత్రి సమయంలో రోగి బంధువులు, కుటుంబ సభ్యులకు తెలుపకుండా దొంగచాటుగా రోగిని అంబులెన్స్‌లో తరలించేందుకు ప్రయత్నిస్తుండగా బంధువులు, కుటుంబ సభ్యులు గమనించి అడ్డుకుని ఆస్పత్రి వర్గాలను నిలదీశారు. అంతేకాకుండా ఆస్పత్రి ఎదుట ఆస్పత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు.

మృతి చెందిన వ్యక్తికి వెంటిలేటర్‌ ఏర్పాటు చేసి చికిత్సను అందించారని కేవలం ఇన్సూరెన్స్‌ను క్లయిమ్‌ చేసుకునేందుకు మృతిచెందిన వ్యక్తికి చికిత్సను అందించారని ఆరోపణలు చేస్తూ ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న ఎల్‌బీనగర్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు. కామినేని హాస్పిటల్స్‌ సూపరింటెండెంట్‌ వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులో రాలేదు.

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top