సుప్రీం కోర్టులో తెలంగాణ సర్కార్‌కు భారీ ఊరట | Sakshi
Sakshi News home page

సుప్రీం కోర్టులో తెలంగాణ సర్కార్‌కు భారీ ఊరట

Published Wed, Jul 13 2022 11:07 AM

Supreme Court Verdict On Land Worth Rs 300 Crore In Hyderabad - Sakshi

బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): సుప్రీం కోర్టులో రాష్ట్ర సర్కారుకు భారీ ఊరట లభించింది. రూ.300 కోట్ల విలువైన స్థలం ప్రభుత్వానిదేనంటూ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో షేక్‌పేట  రెవెన్యూ అధికారులు సదరు స్థలాన్ని మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. అది ప్రభుత్వ స్థలమని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. షేక్‌పేట తహసీల్దార్‌ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... షేక్‌పేట మండలం బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 14 ప్రధాన రహదారిలోని సర్వే నెంబర్‌ 403లో ప్రభుత్వానికి రెండెకరాల పది గుంటల స్థలం ఉంది.
చదవండి: హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద నీరు.. జీహెచ్‌ఎంసీ అలర్ట్‌

ఈ స్థలం తనదేనంటూ డి. రంగస్వామి అనే వ్యక్తి రెండు దశాబ్దాలుగా న్యాయస్థానంలో పోరాడుతున్నాడు. దాదాపు రూ.300 కోట్ల విలువ చేసే ఈ స్థలంపై ప్రభుత్వం కూడా సిటీ సివిల్‌ కోర్టులో విజయం సాధించగా సదరు కబ్జాదారు జాగా తనదేనంటూ హైకోర్టును ఆశ్రయించాడు. వాదనలు విన్న తర్వాత 2021 ఏప్రిల్‌ 1న హైకోర్టు ఈ స్థలం బి. రంగస్వామికి చెందినదని తీర్పునిచ్చింది. ఆ తెల్లవారే సదరు వ్యక్తి హైకోర్టు తీర్పుతో స్థలం చూట్టూ బ్లూషీట్లు ఏర్పాటు చేసుకొని జీపీఏ అగ్రిమెంట్‌ చేసిన శాంతా శ్రీరాం రియల్టర్‌కు అప్పగించాడు.

ఈ నేపథ్యంలో ఖరీదైన స్థలాన్ని కావాలనే అప్పగించేశారంటూ ఆరోపణలు వినిపించాయి. ప్రభుత్వ వాదనలు సరిగా లేవంటూ పలువురు విమర్శించారు. దీంతో స్పందించిన ప్రభుత్వం 2021 జూన్‌లో సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఆ కొద్ది రోజులకే సుప్రీం కోర్టు ఈ స్థలంపై స్టేటస్‌కో విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నుంచి ఈ స్థలం తమదేనంటూ పక్కాగా ఆధారాలు సమర్పించారు. ఏడాది కాలంలో స్థలానికి సంబంధించిన కీలక పత్రాలను కోర్టులో సమర్పించారు. దీంతో సుప్రీం కోర్టు ఈ స్థలం ప్రభుత్వానిదేనంటూ సోమవారం కీలక తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలోనే షేక్‌పేట మండల రెవెన్యూ అధికారులు స్థలాన్ని స్వాదీనం చేసుకొని తమ అదీనంలోకి తీసుకున్నారు.   

Advertisement
Advertisement