‘గ్రీన్‌ క్రాకర్స్‌’కు ఓకే

Supreme Court Given Green Signal For Green Crackers In Telangana - Sakshi

రాష్ట్రంలో తక్కువ కాలుష్య టపాసుల వినియోగానికి ఆంక్షలతో సుప్రీంకోర్టు అనుమతి

గాలి నాణ్యత ప్రకారం రాత్రి 8–10 వరకే కాల్చాలన్న ఎన్జీటీ ఉత్తర్వుల అమలుకు ఆదేశం

హైకోర్టు ‘బాణసంచా నిషేధం’ తీర్పునకు సవరణ

విచారణ 16కు వాయిదా  

సాక్షి, న్యూఢిల్లీ : దీపావళి వేళ రాష్ట్రంలో బాణ సంచా డీలర్లు, విక్రేతలకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి, వాయు కాలు ష్యం దృష్ట్యా తెలంగాణ వ్యాప్తంగా టపాసుల విక్రయాలు, వినియోగంపై నిషేధం విధిస్తూ హైకోర్టు గురువారం ఇచ్చిన తీర్పును సర్వో న్నత న్యాయస్థానం శుక్రవారం స్వల్పంగా సవ రించింది. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశాలకు అనుగుణంగా గాలి నాణ్యత సూచీల ప్రకారం రాష్ట్రంలో గ్రీన్‌ క్రాకర్స్‌ (తక్కువ కాలుష్యంతో ఉండేవి) విక్రయాలు, వినియోగానికి ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక సమయాన్ని నిర్దేశించకపోతే దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్‌ వంటి ప్రత్యేక తేదీల్లో గాలి నాణ్యత సాధారణంగా ఉన్న ప్రాంతాల్లో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలన్న ఎన్జీటీ ఆదేశాలను తెలంగాణలోనూ అమలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును సవాల్‌చేస్తూ తెలంగాణ ఫైర్‌వర్క్స్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ (టీఎఫ్‌డబ్ల్యూడీఏ) దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టిన జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టు తీర్పుతో మా జీవన హక్కుకు విఘాతం...
ఈ పిటిషన్‌పై తెలంగాణ ఫైర్‌వర్క్స్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ తరఫున సీనియర్‌ అడ్వొకేట్‌ సల్మాన్‌ ఖుర్షీద్‌ వాదనలు వినిపించారు. బాణసంచా తయారీ, విక్రయం చేపట్టే వ్యక్తుల జీవన హక్కుకు హైకోర్టు తీర్పు విఘాతం కలిగించేలా ఉందని వాదించారు. అందువల్ల హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరారు. అయితే ప్రతివాదులు శుక్రవారం విచారణకు రాలేకపోయిన అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం... ప్రతివాదుల వాదన వినికుండా హైకోర్టు తీర్పుపై స్టే విధించలేమని స్పష్టం చేసింది.

ప్రతివాదులు విచారణలో పాల్గోనప్పటికీ అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎన్జీటీ మార్గదర్శకాలకు అనుగుణంగా హైకోర్టు ఉత్తర్వుల్లో మార్పులు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ కేసులో ప్రతివాదులైన పి. ఇంద్రప్రకాశ్‌ (హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేసిన న్యాయవాది), తెలంగాణ సీఎస్, డీజీపీ తదితరులకు నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. దేశ రాజధాని ఢిల్లీ సహా గతేడాది నవంబర్‌లో నమోదైన గాలి నాణ్యతతో పోలిస్తే ఈసారి అంతకంటే తక్కువకు పడిపోయిన అన్ని నగరాలు, పట్టణాల్లో టపాసుల వినియోగాన్ని సంపూర్ణంగా నిషేధిస్తూ ఎన్జీటీ ఈ నెల 9న ఆదేశాలు జారీ చేసింది. కాగా, గురువారం హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు రాష్ట్రవ్యాప్తంగా బాణసంచా విక్రయాలు, వినియోగంపై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందు ఉత్తర్వులు జారీ చేసింది.

‘గ్రీన్‌ క్రాకర్స్‌’ అంటే ?
తక్కువ వాయు, ధ్వని కాలుష్యం విడుదల చేసే ముడిపదార్థాలతో తయారయ్యే టపాసులనే గ్రీన్‌ కాకర్స్‌ అంటారు. సంప్రదాయ పద్ధతుల్లో తయారుచేసే టపాకాయల కంటే ఇవి 30–35 శాతం తక్కువగా కాలుష్యాన్ని వెదజల్లుతాయి. గ్రీన్‌ క్రాకర్స్‌లో పార్టిక్యులేట్‌ మ్యాటర్‌ 2.5 కాలుష్య కణాలు తగ్గించే ప్రత్యామ్నాయ ముడి పదార్థాలను ఉపయోగిస్తారు. వీటిని పేల్చినప్పుడు దుమ్మును సంగ్రహించేందుకు ‘వాటర్‌ మాలిక్యూల్స్‌’ వెదజల్లేలా కెమికెల్‌ ఫార్ములేషన్‌ ఉంటుంది.

వీటిలో లిథియం, బేరియం, లెడ్, అర్సెనిక్‌ వంటి రసాయనాలు ఉండవు. సాధారణ టపాకాయల నుంచి దాదాపు 160 డెసిబుల్స్‌ దాకా శబ్దాలు వస్తే గ్రీన్‌ క్రాకర్స్‌ నుంచి 110–125 డెసిబుల్స్‌ లోపే శబ్దాలు వెలువడతాయి. ఇవి మామూలు టపాసుల ధరలతో పోలిస్తే 15–20 శాతం చవకగా తయారవుతాయి. వీటిలో సేఫ్‌ వాటర్‌ రిలీజర్‌ (శ్వాస్‌), సేఫ్‌ థర్మయిట్‌ క్రాకర్‌ (స్టార్‌), సేఫ్‌ మినిమల్‌ అల్యూమినియమ్‌ (సఫల్‌) అనే మూడురకాల గ్రీన్‌ క్రాకర్స్‌ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

కౌన్సిల్‌ ఫర్‌ సైంటిఫిక్, ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌)కు చెందిన నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎస్‌ఐఆర్‌–నీరి) ఆధ్వర్యంలో వీటిని అభివృద్ధి చేశారు. గ్రీన్‌ క్రాకర్స్‌ను తయారు చేసే ఉత్పత్తిదారులు ముందుగా గ్రీన్‌ క్రాకర్స్‌ ఫార్ములేషన్‌ను ఉపయోగించేందుకు సీఎస్‌ఐఆర్‌తో ఒప్పందంపై సంతకాలు చేయాలి. వీటిని గుర్తించేందుకు వీలుగా ఈ టపాకాయల ప్యాకెట్లపై ‘గ్రీన్‌ ఫైర్‌వర్క్స్‌’ లోగో, క్యూర్‌కోడ్స్‌ ఉంటాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top