సీఎం శిలాఫలకం మాయం.. ఒక్కసారి కాదు.. జీహెచ్‌ఎంసీ లేఖ రాస్తుందా? | Stele Was Destroyed That Cobbled By Cm KCR At Banjara Hills | Sakshi
Sakshi News home page

Banjara Hills: సీఎం శిలాఫలకం మాయం.. ఒక్కసారి కాదు.. జీహెచ్‌ఎంసీ లేఖ రాస్తుందా?

Mar 14 2022 8:32 AM | Updated on Mar 14 2022 3:03 PM

Stele Was Destroyed That Cobbled By Cm KCR At Banjara Hills - Sakshi

సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో కబ్జాలు తొలగిస్తున్న అధికారులు

స్థలాన్ని కాపాడుకోవడంలో విఫలమైన జీహెచ్‌ఎంసీ కేసీఆర్‌ హామీని నిలబెట్టడంలోనూ పూర్తిగా వైఫల్యం చెందింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మల్టీ పర్పస్‌ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడమే కాకుండా రూ.కోటి...

సాక్షి, బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లోని ఎన్బీటీ నగర్‌లో అయ్యప్ప దేవాలయాన్ని ఆనుకొని ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఎకరం విస్తీర్ణంలో మల్టీ పర్పస్‌ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం కోసం రూ.1 కోటి మంజూరు చేయడమే కాకుండా 2015 జూన్‌ 3న ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అయితే ఏడేళ్లు గడిచినా ఇంత వరకు ఇక్కడ పునాది రాయి కూడా పడలేదు. ఫలితంగా సదరు స్థలం రోజుకింత చొప్పున అన్యాక్రాంతమవుతూ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోంది. సర్కారు స్థలాలను కాపాడుకోవడంలో జీహెచ్‌ఎంసీ పూర్తిగా విఫలమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా శంకుస్థాపన చేసిన ప్రాంతంలోనే ఏడేళ్లుగా కనీసం పునాది రాయి కూడా వేయకపోవడం ఆ శాఖ నిర్వాకానికి అద్దం పడుతోంది. 

జీహెచ్‌ఎంసీ వైఫల్యంతోనే..
స్థలాన్ని కాపాడుకోవడంలో విఫలమైన జీహెచ్‌ఎంసీ కేసీఆర్‌ హామీని నిలబెట్టడంలోనూ పూర్తిగా వైఫల్యం చెందింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మల్టీ పర్పస్‌ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడమే కాకుండా రూ.కోటి మంజూరు చేయగానే సంబంధిత అధికారులు  వెంటనే సదరు స్థలాన్ని స్వాధీనం చేయాలంటూ హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాయాల్సి ఉంది. అయితే ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.  
చదవండి: Banjara Hills: సీఎం శిలాఫలకానికే దిక్కులేదు.. ఇప్పటికైనా సాధ్యమేనా..?

మాయమైన శిలాఫలకం...  
సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేసిన స్థలాన్ని వినియోగించుకోవడంలో జీహెచ్‌ఎంసీ ఎంతో ముందు చూపుతో వ్యవహరించాల్సి ఉంది. అయితే అందుకు విరుద్ధంగా వ్యవహనించడంతో సీఎం వేసిన శిలా ఫలకం ఏడాది లోపే ఎత్తుకెళ్లారు. ఈ విషయంపై పత్రికల్లో కథనాలు రావడంతో అధికారులు హుటాహుటిన మళ్లీ శిలాఫలకాన్ని ఏర్పా టు చేశారు. అయితే రెండో సారి ఏర్పాటు చేసిన శిలాఫలకం కూడా మాయం కావడం గమనార్హం. స్థలాన్ని కాపాడుకోవడంలోనూ, శిలాఫలకాన్ని కాపాడటంలోనూ, కేటాయించిన నిధులను వినియోగించుకోవడంలోనూ జీహెచ్‌ఎంసీ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

ఇప్పటికైనా సాధ్యమేనా..?  
గ్రేటర్‌ మేయర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న బంజారాహిల్స్‌ డివిజన్‌లోనే సీఎం కేసీఆర్‌ మల్టీ పర్పస్‌ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినా జీహెచ్‌ఎంసీ వాటిని సద్వినియోగం చేసుకోకపోగా స్థలం అన్యాక్రాంతం అయ్యేదాకా కళ్లప్పగించి చూస్తోంది. రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకుని ఈ స్థలంలో ఆక్రమణలను ఇటీవలనే తొలగించారు. కనీసం ఇప్పటికైనా కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం కోసం జీహెచ్‌ఎంసీ కలెక్టర్‌కు లేఖ రాస్తుందో, మళ్లీ నిర్లక్ష్యం వహిస్తుందో వేచి చూడాలి.  
చదవండి: వనస్థలిపురంలో దారుణం.. ముళ్లపొదల్లో మృతశిశువు తల లభ్యం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement