రోడ్డుపై గుంత: చందానగర్‌ ఇన్‌స్పెక్టర్‌కు నోటీసులు

State Hrc Issues Notice To Chandanagar Police Station - Sakshi

ఫిర్యాదుపై ఇంత నిర్లక్ష్యమా?

హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన బాధితుడు  

చందానగర్‌ ఇన్‌స్పెక్టర్‌కు నోటీసులు 

చందానగర్‌: రోడ్డుపై ఏర్పడిన గుంత కారణంగా తన వెన్నెముకకు గాయమైందని ఓ వ్యక్తి చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారు స్పందించకపోవవడంతో బాధితుడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్‌సీ)ని ఆశ్రయించారు. దీనిపై వివరణ ఇవ్వాలని చందానగర్‌ ఇన్‌స్పెక్టర్‌కు హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..మియాపూర్‌కు చెందిన వంగల వినయ్‌ గత ఏడాది డిసెంబర్‌ 3న జాతీయ రహదారిపై తన ద్విచక్ర వాహనంపై  మియాపూర్‌ నుంచి బీహెచ్‌ఈఎల్‌ వైపు వెళ్తున్నారు.

ఈ క్రమంలో జాతీయ రహదారిపై గంగారం వద్ద రోడ్డుకు అడ్డంగా తవ్వి వదిలేసిన గుంతలో బైక్‌ పడటంతో వినయ్‌ వెన్నెముకకు గాయమైంది. ఆస్పత్రిలో చికిత్స అనంతరం..రహదారి పర్యవేక్షణ లేకపోవడంతో తనకు గాయమైందని దీనికి కారణమైన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో డిసెంబర్‌ 6న ఫిర్యాదు చేశారు. మియాపూర్‌ పోలీసులు పరిశీలించి ఘటన జరిగిన ప్రాంతం చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోకి వస్తుందన్నారు.

ఫిర్యాదును చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు. చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కూడా వినయ్‌ మళ్లీ ఫిర్యాదు చేశారు. 15 రోజులైనా ఫిర్యాదుపై ఎలాంటి స్పందన రాకపోవడంతో జనవరి 2న హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించారు. దీంతో శనివారం చందానగర్‌ ఇన్‌స్పెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. జూన్‌ 21న హెచ్‌ఆర్‌సీ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.
( చదవండి: నగరంలో ముగ్గురు బాలికల అదృశ్యం ) 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top