15,254 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌

The state has set a new record in peak power demand - Sakshi

విద్యుత్‌ పీక్‌ డిమాండ్‌లో రాష్ట్రం కొత్త రికార్డు 

14,750 మెగావాట్ల పాత రికార్డును అధిగమించిన రాష్ట్రం 

16 వేల మెగావాట్లకు పీక్‌ డిమాండ్‌ పెరిగే అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌లో రాష్ట్రం కొత్త చరిత్ర సృష్టించింది. మంగళవారం ఉదయం 10:03 గంటలకు రాష్ట్రంలో విద్యుత్‌ పీక్‌ డిమాండ్‌ 15,254 మెగావాట్లుగా నమోదైంది. విద్యుత్‌ డిమాండ్‌ 15 వేల మెగావాట్లకు మించడం ఇదే తొలిసారి. ఈ నెలలోనే నమోదైన 14,750 మెగావాట్ల పీక్‌ డిమాండ్‌ను మంగళవారం రాష్ట్రం అధిగమించింది. గతేడాది మార్చిలో 14,160 మెగావాట్లుగా పీక్‌ డిమాండ్‌ నమోదైంది.

వేసవి మొదలవడంతో వ్యవసాయ, గృహ అవసరాల విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగిపోయింది. ఇళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వాణిజ్య సంస్థల్లో ఏసీలు, ఇతర ఉపకరణాల వాడకం పెరిగింది. రాష్ట్రంలోని 30 లక్షల వ్యవసాయ బోరుబావుల కింద సాగు చేస్తున్న పంటలకు నీటి సరఫరా కోసం రైతులు భారీగా విద్యుత్‌ వినియోగిస్తున్నారు. దీనికితోడు సాగు విస్తీర్ణం పెరగడం కూడా విద్యుత్‌ వినియోగాన్ని పెంచింది. పారిశ్రామిక విద్యుత్‌ డిమాండ్‌ సైతం గణనీయంగా పెరిగిపోయింది.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని రెండు పంప్‌హౌస్‌ల ద్వారా నీటిని ఎత్తిపోయడానికి 600 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. దీంతో రోజువారీ విద్యుత్‌ డిమాండ్‌ విపరీతంగా పెరిగిపోయిందని విద్యుత్‌ సంస్థల వర్గాలు పేర్కొంటున్నాయి. మార్చి చివరి వరకు పీక్‌ విద్యుత్‌ డిమాండ్‌ 16,000 మెగావాట్లకు పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఆ మేరకు విద్యుత్‌ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ట్రాన్స్‌కో తెలిపింది. 

13 రోజుల్లో రూ.600 కోట్ల విద్యుత్‌ కొనుగోళ్లు 
వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌ పెరగడంతో నిరంతర విద్యుత్‌ సరఫరాకు వీలుగా విద్యుత్‌ సంస్థలు ఎఎక్స్చేంజి ల నుంచి భారీ స్థాయిలో విద్యు­త్‌ కొనుగోళ్లు చేస్తున్నాయి. ఈ నెలలో గత 13 రోజుల్లో రూ. 600 కోట్ల వ్యయంతో 930 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేశాయి. రోజుకు సగటున రూ. 45 కోట్ల వ్యయంతో 72 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను కొన్నాయి.

ని­రం­తర విద్యుత్‌ సరఫరాకు అవసరమైన విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు రూ. 4 వేల కోట్ల రుణాలను ప్రభుత్వ పూచికత్తుతో తీసుకోవడానికి అనుమతిస్తూ గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీల నుంచి రూ. 3 వేల కోట్ల రుణం కోసం రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. త్వరలో ఈ మేరకు రుణం విడుదల కానుంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top