సాక్షి,హైదరాబాద్: డ్రగ్స్ రహిత హైదరాబాద్, డ్రగ్స్ రహిత భారత్ (నషా ముక్త్ భారత్) లక్ష్యంతో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి నేటి నుంచి మూడు రోజుల పాటు పాదయాత్ర చేపట్టనున్నారు. ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ పేరుతో నిర్వహించే ఈ యాత్ర ఈ నెల 25, 26, 27 తేదీల్లో కొనసాగనుంది.
ఇవాళ ఉదయం 9 గంటలకు అంబర్‌పేట్ మహంకాళి ఆలయం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమై, జూబ్లీహిల్స్ ఫిల్మ్ నగర్ వరకు సాగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ లక్ష్మణ్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ప్రముఖ సినీ హీరో వెంకటేష్ తదితరులు పాల్గొని మద్దతు తెలపనున్నారు.
రాజకీయాలకు అతీతంగా..: కిషన్ రెడ్డి
పాదయాత్ర నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సాక్షి టీవీతో మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలనే సదుద్దేశంతోనే ఈ యాత్ర చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. ఇదొక సామాజిక బాధ్యత అని, రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తనపై వచ్చే విమర్శలను తాను పట్టించుకోనని, సామాజిక అంశాలపై నిరంతరం పోరాటం చేస్తానని తేల్చిచెప్పారు. మాదకద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా అడుగులు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.


