
సరోగసీ పేరుతో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ దందా
ప్రభుత్వ అనుమతి అవసరం లేకుండానే చేస్తామంటూ జంటలతో ఒప్పందాలు
ఒక్కో కేసుకు రూ.40 లక్షల దాకా వసూలు.. సరోగసీ నిర్వహించకుండా పేదింటి పిల్లల అప్పగింత
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఓ జంటను మోసగించడం..తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించగా, దీనిపై పోలీసుల దర్యాప్తులో నిర్ఘాంతపోయే విషయాలు వెలుగులోకొచ్చాయి. ఈ సెంటర్ కేంద్రంగా వ్యవస్థీకృత శిశు విక్రయాల దందా సాగుతున్న వైనం బట్టబయలయ్యింది. ఇప్పటికే పది కేసులు ఉండి, ఎలాంటి అనుమతులు లేకుండా ఈ సెంటర్ నిర్వహిస్తున్న అట్లూరి నమ్రత అలియాస్ పచ్చిపాల నమ్రత మరో వైద్యురాలి పేరుతో కథ నడిపిస్తున్నట్లు తెలిసింది.
సంతానం కోసం వచ్చే వారికి ప్రభుత్వ అనుమతి, ఇతర ప్రొసీజర్‌తో పని లేకుండా సరోగసీ చేస్తామని చెప్పి లక్షల్లో వసూళ్లు చేస్తూ.. చివరకు అలాంటి ప్రక్రియ ఏదీ చేయకుండా నిరుపేద దంపతులకు ఎరవేసి, వారికి చెందిన పిల్లల్ని అప్పగిస్తున్నట్లు తేలింది. రాజస్థాన్‌కు చెందిన ఓ జంటకు కూడా ఇలాగే చేయగా..వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ‘సృష్టి’నిర్వాకం తాజాగా మరోసారి బయటపడింది.
గోపాలపురం పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించి హైదరాబాద్, విశాఖపట్నంలో కలిపి 8 మందిని అరెస్టు చేశామని, వీరిలో గాంధీ ఆస్పత్రి అనస్థీషియా స్పెషలిస్ట్ సదానందం కూడా ఉన్నట్లు నార్త్‌జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ ఆదివారం వెల్లడించారు. మరో 50 మంది పరారీలో ఉన్నారని వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని తెలిపారు. ఏసీపీ సుబ్బయ్యతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు.
ఇప్పటికే 10 కేసులు..రెన్యువల్ కాని లైసెన్స్
1995 నుంచి వైద్య వృత్తిలో ఉన్న నమ్రత 1998 నుంచి ఫెర్టిలిటీ, ఐవీఎఫ్ రంగంలోకి దిగారు. సికింద్రాబాద్, కొండాపూర్, విశాఖపట్నం, విజయవాడల్లో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో క్లినిక్స్ నిర్వహిస్తున్నారు. లింగ నిర్థారణ పరీక్షలు సహా అనేక అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఈమెపై హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలో 10 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆమె ఫెర్టిలిటీ సెంటర్ నిర్వహణ లైసెన్స్‌ను 2021లో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ పొడిగించలేదు. దీంతో తాను ఆ వృత్తి నిర్వహించట్లేదంటూ నమ్రత లేఖ కూడా ఇచ్చారు.
నగరంలో నాలుగు చోట్ల సెంటర్లు
నమ్రత సికింద్రాబాద్‌లోని గోపాలపురంలో నాలుగు అంతస్తుల భవనంతో పాటు మరో మూడుచోట్లా అక్రమంగా ఈ సెంటర్లు నిర్వహిస్తున్నారు. అయితే తన పేరుతో కాకుండా డాక్టర్ సూరి శ్రీమతి పేరుతో ముద్రించిన లెటర్ హెడ్స్‌తో కథ నడిపిస్తున్నారు. ఆన్‌లైన్‌తో పాటు కరపత్రాల ద్వారా ఐవీఎఫ్ విధానం పేరుతో ప్రచారం చేస్తున్న నమ్రత.. సంతాన భాగ్యం కోసం తమ వద్దకు వచ్చే వారికి కొన్ని పరీక్షలు చేసి, ఆ విధానంతో ఫలితం లేదని చెప్తున్నారు.
ప్రభుత్వ అనుమతి అవసరం లేకుండా గుట్టుగా సరోగసీ చేస్తామంటూ ఒప్పందాలు చేసుకుంటున్నారు. అంగీకరించిన భార్యభర్తల నుంచి ఎగ్, వీర్య సంగ్రహణ పేరుతో సికింద్రాబాద్‌తో పాటు వైజాగ్‌లో ఉన్న క్లినిక్స్‌లో హడావుడి చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ తంతు నిర్వహణలో గాంధీ ఆస్పత్రి అనస్థీషియా స్పెషలిస్ట్ నార్గుల సదానందం సహకరిస్తున్నారు.
ఎంపిక చేసిన మహిళతో సరోగసీ చేస్తున్నామని, వివరాలన్నీ రహస్యమని చెబుతూ భార్యభర్తలకు ఫోన్ ద్వారా మాత్రమే సమాచారం ఇస్తున్నారు. అయితే సరోగసీ ప్రక్రియ ఏదీ నిర్వహించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసుకున్న దళారుల ద్వారా నిరుపేద గర్భవతుల్ని గుర్తించి వారి భర్తలతో సంప్రదింపులు జరుపుతున్నారు. పుట్టిన శిశువును తమకు విక్రయిస్తే నగదు ఇస్తామంటూ ఒప్పందాలు చేసుకుంటున్నారు.
ప్రసవ సమయానికి మహిళల్ని తామే తీసుకువెళ్లి డెలివరీలు చేస్తున్నారు. ఒక ప్రాంతానికి చెందిన వారిని మరో ప్రాంతానికి తరలించి ఈ తంతు పూర్తి చేస్తున్నారు. ఆ సమయంలోనూ సిజేరియన్ సహా మరికొన్ని ఖర్చులు అయ్యాయంటూ ఒప్పందం చేసుకున్న వారి నుంచి మరికొంత గుంజుతున్నారు. వేరే వారికి పుట్టిన శిశువును ఆయా జంటలకు సరోగసీ బిడ్డగా అప్పగిస్తున్నారు. ఇలా ఒక్కో కేసుకు రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది.
శిశువు పోలికలపై అనుమానంతో..
సికింద్రాబాద్‌లో నివసించిన రాజస్థాన్ జంటను నమ్రత ఇలానే మోసం చేశారు. శిశువు పోలికలపై అనుమానం వచ్చిన దంపతులు నమ్రతను నిలదీయగా సరైన సమాధానం రాలేదు. దీంతో ఢిల్లీలో డీఎన్‌ఏ టెస్టులు చేయించుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సరోగసీ పేరుతో తమ వద్ద రూ.30.25 లక్షలు తీసుకున్నారని బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది.
దీంతో నార్త్‌జోన్ టాస్‌్కఫోర్స్ సాయంతో దాడులు చేసిన గోపాలపురం పోలీసులు.. నమ్రత, జయంత్ కృష్ణ, విశాఖ బ్రాంచ్ మేనేజర్ సి.కళ్యాణి, టెక్నీషియన్ జి.చిన్నారావు, సదానందం, దళారి డి.సంతోషి, అసోం నుంచి వచ్చి నగరంలో నివసిస్తున్న సదరు శిశువు తల్లిదండ్రులైన మహ్మద్ అలీ ఆదిక్, నస్రీన్ బేగంలను అరెస్టు చేశారు. ‘సృష్టి’నుంచి సేకరించిన రికార్డుల ఆధారంగా మరో 50 మందిని నిందితులుగా గుర్తించారు. వీరికోసం గాలిస్తున్నారు. ఫిర్యాదు చేసిన జంట నుంచి శిశువును స్వా«దీనం చేసుకున్న పోలీసులు శిశువిహార్‌కు తరలించారు.
ఎవరైనా ప్రశి్నస్తే రంగంలోకి నమ్రత కుమారుడు
ఈ దందాలో ఎవరికైనా, ఏదైనా అనుమానం వచ్చి ప్రశి్నస్తే.. ‘సృష్టి’ప్రాంగణంలో లీగల్ ఆఫీస్ నిర్వహిస్తున్న నమ్రత కుమారుడు, న్యాయవాది జయంత్ కృష్ణ రంగంలోకి దిగుతాడని తెలిసింది. ఈ వ్యవహారంలో మీదీ నేరమే అని, విషయం బయటకు వస్తే అంతా అరెస్టు అవుతారని చెప్పి భయపెడతాడని, సెంటర్ ఆర్థిక లావాదేవీలను ఇతడే పర్యవేక్షిస్తుంటాడని తెలిసింది. కాగా తన పేరుతో ఈ సెంటర్ నడుస్తున్నట్లు సూరి శ్రీమతికి తెలుసా? లేదా? అనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. ‘సృష్టి’బారినపడి మోసపోయిన వాళ్లు ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.