‘నన్ను మా దేశానికి పంపండి’ 

Srilanka Man Attempted Suicide by Pouring Petrol At Basheer Bagh Police Station - Sakshi

శ్రీలంక పౌరుడు జాయ్‌ వేడుకోలు 

6ఏళ్ల వయస్సులో తప్పిపోయి జువైనల్‌ హోంకు తరలింపు

పోలీసు కమిషనర్‌ కార్యాలయం ఎదుట నిరసన

పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం

సాక్షి, హిమాయత్‌నగర్‌: ‘‘నన్ను చిన్నప్పుడే మద్రాస్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి జైల్లో వేశారు. మా అమ్మ ఎలా ఉందో.. మా నాన్న ఎలా ఉన్నాడో.. ఇంత వరకు చూడలేదు. నన్ను శ్రీలంక పంపండంటూ’’ ఓ యువకుడు బషీర్‌బాగ్‌ పోలీసు కమిషనర్‌ కార్యాలయం ఎదుట నిరసనకు దిగాడు. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పెట్రోల్‌ పోసుకుని నిప్పు అంటించుకునే ప్రయత్నం చేశాడు. అక్కడున్న వారు అడ్డుకుని నారాయణగూడ పోలీసులకు అప్పగించారు.

ఈ సందర్భంగా జాయ్‌ మాట్లాడుతూ ‘‘మేము శ్రీలంక దేశం ఫిషర్‌ బోర్డ్‌ సమీపంలో నివాసం ఉండే వాళ్లం. నా ఆరేళ్ల వయస్సప్పుడు ‘ఎల్‌టీటీఈ’ ఉద్యమం జరిగిందని, ఆ అల్లర్లలో నేను తప్పిపోయి షిప్‌లో భారత దేశంలోని నాగాలాండ్‌కు వచ్చాను’’ అన్నాడు. అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసి క్యాంప్‌లో ఉండకపోయే సరికి అరెస్ట్‌ చేసి మద్రాస్‌ జువైనల్‌ హోంలో ఉంచారని, తనకు 16 ఏళ్లు నిండాక హోం నుంచి బయటకు వచ్చానన్నాడు. మద్రాస్‌లోని ఓ చర్చి ఫాదర్‌ తనను కొంతకాలం చేర దీశాడని, ఆ తర్వాత ఢిల్లీ హైకమీషన్‌లోని శ్రీలంక ఎంబసీని కూడా కలిశానని అన్నాడు. 

వెళితేనే కదా గుర్తు పట్టేది.. 
‘‘శ్రీలంక ఎంబసీ వాళ్లు అక్కడ ఎవరు ఉన్నారు అడ్రాస్‌ చెప్పు అంటున్నారు. 6 ఏళ్ల వయస్సుప్పుడు తప్పిపోయాను. అక్కడ అడ్రస్‌ చెప్పమంటే ఎలా చెబుతాను. నన్ను మా దేశానికి పంపించేస్తే నా తల్లిదండ్రులను కలుసుకుంటాను కదా. నన్ను ఎందుకిలా వేధిస్తున్నారు. నా ఫొటోను శ్రీలంక పత్రికల్లో వేసి అక్కడి వాళ్లకు సమాచారం ఇవ్వండి. నాకు సాయం చేసే వాళ్లు ఎవరైనా ఉంటారేమోనని అన్ని రాష్ట్రాలు తిరిగాను. నన్ను ఎవ్వరూ గుర్తించట్లేదు. ఫుట్‌పాత్‌ల మీద పడుకుని, అడుక్కుని తిని ఉండలేకపోతున్నాను. మా నాన్న, అమ్మ గుర్తుకు వస్తుంటే ఏడుపు ఆగట్లేదు. కమిషనర్‌ సార్‌ని కలిస్తే ఆయన పెద్ద వాళ్లతో మాట్లాడి నన్ను శ్రీలంక పంపిస్తారనే ఆశతో ఇక్కడకు వచ్చాను. లోపలికి వెళ్లనివ్వట్లేదని ధైర్యం లేకపోయినా ఇలా పెట్రోల్‌ పోసుకుని చచ్చిపోవడానికి ప్రయత్నించాను. దయచేసి నన్ను మా శ్రీలంకకు పంపేయండి’’ అంటూ ఉద్వేగానికి గురయ్యాడు. నచ్చచెప్పి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నామని, ఉన్నతాధికారుల దృష్టికి జాయ్‌ విషయం చేరవేస్తున్నట్లు అడ్మిన్‌ ఎస్సై కర్ణాకర్‌ రెడ్డి తెలిపారు.

చదవండి: నడి సంద్రంలో నాలుగు రోజులు, అంతా సేఫ్‌!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top