ప్రభుత్వ టీచర్ల కోసం ప్రత్యేక టెట్‌ | Special TET for government teachers | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ టీచర్ల కోసం ప్రత్యేక టెట్‌

Jun 4 2026 3:46 AM | Updated on Jun 4 2026 3:48 AM

Special TET for government teachers

ఏడాదికి రెండు సార్లు నిర్వహణ... సుప్రీంకోర్టు ఆదేశంతో నిర్ణయం 

విద్యాశాఖ ఉత్తర్వులు.. 30 వేల మంది టీచర్లకు ఊరట 

టీచర్ల కోసం ప్రత్యేక ప్రశ్నపత్రం.. నిరుద్యోగులకు ఇందులో అవకాశం ఉండదు 

ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష... సిలబస్‌ కొంత తేలికగా ఉండే వీలు 

పేపర్‌–2 సిలబస్‌ను సబ్జెక్టు వారీగా నిర్వహించాలని కోరుతున్న ఉపాధ్యాయ సంఘాలు

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్‌ గండం నుంచి ఊరట లభించింది. టీచర్ల కోసమే ఏడాదికి రెండు సార్లు ప్రత్యేక టెట్‌ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది, విద్యా శాఖ ఈమేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. టీచర్ల టెట్‌ వ్యవహారం కొన్నేళ్ళుగా వివాదాస్పదంగా మారింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) పాఠశాలల్లో పనిచేయడానికి అవసరమైన కనీస అర్హత పరీక్ష. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి మార్గదర్శకాల ప్రకారం ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక స్థాయిల్లో బోధించే ఉపాధ్యాయులకు టెట్‌ అర్హత తప్పనిసరి. 

ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఎయిడెడ్‌ మరియు కొన్ని ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలు, పదోన్నతులు, సేవా ప్రయోజనాల విషయంలో టెట్‌కు కీలక ప్రాధాన్యత ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సర్వీస్‌ టీచర్లకు మినహాయింపు ఇచ్చారు. దీనిపై కొంతమంది కోర్టును ఆశ్రయించారు. ప్రతీ టీచర్‌ విధిగా టెట్‌ అర్హత పొందాలని కోర్టు తీర్పు చెప్పింది. తాజాగా సుప్రీం కోర్టు రివిజన్‌ పిటిషన్‌లోనూ ఇదే తీర్పు వచ్చింది. టీచర్లకు ప్రత్యేక టెట్‌ నిర్వహించడం ఒక్కటే మార్గమని టీచర్స్‌ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌ రెడ్డి ప్రభుత్వానికి నివేదించారు. ఈ సిఫార్సు ఆధారంగా ఏడాదికి రెండు సార్లు టెట్‌ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.  

టీచర్లకే ప్రత్యేకం 
రాష్ట్రంలో ప్రతీ ఏటా టెట్‌ నిర్వహిస్తున్నారు. ఇది నిరుద్యోగులు, ఉపాధ్యాయులకు కలిపి చేపడతారు. కోర్టు ఆదేశం తర్వాత సర్వీస్‌ టీచర్లు కూడా ఇదే టెట్‌ ద్వారా అర్హత పొందాల్సి ఉంటుంది. అయితే, దీనిపై ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచి్చంది. కొత్తగా బీఎడ్, డీఎడ్‌ పూర్తి చేసిన విద్యార్థులతో సమానంగా సిలబస్‌ ఇస్తున్నారని, ఇది సర్వీస్‌ టీచర్లకు ఇబ్బందిగా ఉందని తెలి పారు. దశాబ్దాల తరబడి ఏదో ఒక సబ్జెక్టు మాత్రమే బోధించే టీచర్‌ అన్ని సబ్జెక్టులు కలిపి టెట్‌ పరీక్ష రాయడం వల్ల ఉత్తీర్ణతకు ఆస్కారం లేదని చెబుతున్నారు. 

పైగా పరీక్ష సన్నద్ధతకు తగిన సమయం దొరకడం లేదంటున్నారు. వీటన్నింటిపైన ఉపాధ్యాయ సంఘాలు కొన్నేళ్ళుగా ఆందోళనలు చేపడుతున్నాయి. తాజాగా నిర్ణయం ప్రకారం ఏడాదికి రెండుసార్లు నిర్వహించే టెట్‌ కేవలం సర్వీస్‌ టీచర్లకు మాత్రమే ఉంటుంది. నిరుద్యోగులకు ఇందులో అవకాశం ఉండదు. టీచర్ల కోసం ప్రత్యేక ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తారు. 

ఆన్‌లైన్‌ విధానంలో జరిగే ఈ పరీక్ష విషయంలో సిలబస్‌ విషయంలో కొంత తేలికగా ఉండే వీలుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో 1.05 లక్షల ప్రభుత్వ టీచర్లు ఉంటే, వీరిలో 30 వేల మంది వరకూ టెట్‌ అర్హత లేని వారు ఉన్నారు. వీళ్ళందరికీ టెట్‌ గండం నుంచి గట్టెక్కే అవకాశం లభిస్తుంది.  
ఉపాధ్యాయ సంఘాల హర్షం

» ప్రత్యేక టెట్‌ నిర్వహణ కోసం అలుపెరగని పోరాటం చేశామని టీచర్స్‌ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌ రెడ్డి తెలిపారు. చివరకు ప్రభుత్వాన్ని దారికి తేవడంలో, న్యాయపరమైన సమస్య పరిష్కరించడంలో పీఆర్‌టీయూటీఎస్‌ అలుపెరు గని కృషి చేసిందన్నారు. ప్రత్యేక టెట్‌ తెస్తామన్న హామీని నిలబెట్టుకున్నామని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్‌ రెడ్డి అన్నారు.

» ప్రత్యేక టెట్‌కు స్వాగతం పలుకుతున్నామని టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి, ప్రధాన కార్యదర్శి ఎ వెంకట్‌ తెలిపారు. అయితే, పేపర్‌–2 సిలబస్‌ను సబ్జెక్టు వారీగా నిర్వహించాలని కోరారు. 

» కొన్నేళ్ళుగా చేస్తున్న పోరాటానికి ఇప్పుడు ముగింపు పలక డం సంతోషంగా ఉందని ఎస్టీయూ టీఎస్‌ అధ్యక్షుడు జి సదానందం గౌడ్, కార్యదర్శి జుట్టు గజేందర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement