
మిస్ వరల్డ్ పోటీదారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
నిరంతరంన్యూట్రీషినిస్టులు, వైద్యసిబ్బంది సేవలు
ప్రత్యేక ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఏం తినాలో వారే చెప్తారు... ఎప్పుడు తినాలో సూచిస్తారు.. దగ్గినా తుమ్మినా పరిగెత్తుకొస్తారు. నలతగా ఉందంటే క్షణాల్లో వాలిపోతారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న సుందరీమణుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. 24 గంటల మెడికల్ కేర్, న్యూట్రీషినిస్టుల సేవలు, నెలసరి సమస్యలు చికాకు పెట్టకుండా అందుబాటులో మహిళా సిబ్బంది.. ఇలా మిస్‌వరల్డ్ పోటీల కోసం ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన సుందరీమణుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. – సాక్షి, హైదరాబాద్
ఐదారేళ్ల శ్రమ..
ప్రపంచ సుందరి కావాలన్న కల చాలామంది యువతుల్లో ఉంటుంది. అందం, ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం, ఆకట్టుకునే తెలివితేటలు.. కలబోసిన సంపూర్ణ వ్యక్తిత్వం.. ఈ లక్షణాలున్నవారు ప్రపంచ సుందరి కిరీటం కోసం ఆరాటపడటం సహజం. దీనిని సాధించుకునే లక్ష్యంతో చాలామంది కఠోర దీక్షగా సాగుతారు. ఎంతో ఇష్టమైన పదార్థాలున్నా ముట్టకుండా దూరంగా ఉంటారు. నిరంతరం కఠినమైన వ్యాయామం చేస్తారు. బద్ధకానికి అందనంత దూరంగా ఉండేందుకు నిరంతరం చలాకీతనం తొణికిసలాడేలా జాగ్రత్తలు తీసుకుంటారు.
ఇవన్నీ ఆచరణలో పెట్టేందుకు వారు తీవ్రంగా శ్రమిస్తారు. దాదాపు ఏడెనిమిది ఏళ్లపాటు దీక్షగా ముందుకు సాగుతారు. ఇన్నేళ్ల పట్టుదల, శ్రమ.. పోటీలయ్యేవరకు సడలకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. వారి సొంత ప్రాంతంలో దీన్ని నిలబెట్టుకున్నా, పోటీల కోసం మరో తరహా వాతావరణం ఉండే ప్రాంతానికి వెళ్లి దాదాపు నెల రోజుల పాటు అక్కడే ఉండాల్సిన పరిస్థితిలో వారు దాన్ని కొనసాగించటం పెద్ద సవాలే. అక్కడి వాతావరణం, పరిస్థితులు, ఆహారంలో మార్పు వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయి. అందుకే పోటీలు జరిగే ప్రాంతంలో దాదాపు రెండు నెలల ముందు నుంచి అక్కడి యంత్రాంగాన్ని మిస్‌వరల్డ్ లిమిటెడ్ అప్రమత్తం చేస్తుంది.
తెలంగాణ ప్రభుత్వానికి ఈ విషయంలో మార్చి మొదటి వారంలోనే మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్‌పర్సన్ జూలియా మోర్లే అప్రమత్తం చేశారు. మొదటిసారి హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడి పరిస్థితులు పరిశీలించి, పోటీకి అనువైన వాతావరణం ఉందని తేల్చుకున్నాక రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో ఈ విషయంపై చర్చించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మెడికల్ టూరిజంలో తెలంగాణ అగ్రభాగాన ఉన్నందున, అక్కడ ప్రపంచ స్థాయి వైద్య వసతులున్నాయని, ఆ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని అధికారులు భరోసా ఇచ్చారు.
టాప్ ఆస్పత్రితో ఒప్పందం..
ప్రస్తుతం నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రితో మిస్ వరల్డ్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొంటున్న యువతులు బస చేసిన ట్రైడెంట్ హోట ల్‌లో ఆ ఆస్పత్రి ఓ ఎమర్జెన్సీ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో షిఫ్టుల వారీగా వైద్యులు నిరంతరం అందుబాటులో ఉంటారు. నర్సులు, పారామెడికల్ సిబ్బంది, న్యూట్రిషనిస్టులు సహాయకంగా ఉంటారు.
» పోటీల్లో పాల్గొంటున్న సుందరీమణుల్లో దాదాపు అన్ని ఖండాలకు చెందిన వారున్నారు. వారి శరీరానికి సరిపడే ఆహార పదార్థాలేమిటో తెలిపే జాబితాను మిస్‌వరల్డ్ ప్రతినిధులు ముందుగానే స్థానిక యంత్రాంగానికి అందజేశారు. ఆయా పదార్థాలు నిత్యం హోటల్‌లో అందుబాటులో ఉంచాలని సూచించారు.
» మంగళవారం చౌమహల్లా ప్యాలెస్‌లో వెల్‌కం డిన్నర్‌లో హైబరాబాద్ బిర్యానీని ప్రత్యేకంగా వడ్డించారు. కానీ, ఈ బిర్యానీని మసాలా తక్కువగా, మధ్య రకంగా, పూర్తిస్థాయి మసాలాతో.. ఇలా మూడు రకాలుగా తయారు చేసి ఉంచారు. యూరప్, అమెరికా తదితర ప్రాంతాలకు చెందిన వారిని తక్కువ మసాలా ఉన్న బిర్యానీ తీసుకోవాల్సిందిగా సూచించటం విశేషం.
»చాలా ఆరోగ్య సమస్యలు మంచినీటితోనే వస్తాయి. అందుకే సాధారణ నీళ్లు కాకుండా, ప్రస్తుతం సుందరీమణులకు లీటరు రూ.800 ఖరీదు చేసే ప్రత్యేక బ్రాండ్ మంచినీటిని అందిస్తున్నట్టు తెలిసింది.
»ప్రస్తుతం హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌లలో దాదాపు 80 రకాల ఇంటర్ కాంటినెంటల్ వంటకాలను బఫేలో ఉంచుతున్నారు. తమకు ఏది సరిపోతుందో ఆ ఆహారా పదార్థాలను సుందరీమణులు ఎంచుకునే వెసులుబాటు కల్పించారు.
» మిస్‌వరల్డ్ తరపున వచ్చిన న్యూట్రిషనిస్టులు సూచించిన ఆహారాన్నే సుందరీమణులు స్వీకరిస్తున్నారు.
»రాష్ట్ర పర్యటనలకు వెళుతున్నప్పుడు కూడా ముందుగానే భోజన వివరాలను తెలిపి, స్టార్ హోటల్‌లో వండించి మరీ సిద్ధం చేస్తున్నారు.
»సుందరీమణులు ఎక్కడకు వెళ్లినా పూర్తి ఎమర్జెన్సీ వైద్య వసతులతో కూడిన అంబులెన్సు ఫాలో అవుతోంది. అందులో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఉంటున్నారు