
స్వర్ణముఖి నదిలో పూడ్చిపెట్టిన వైనం
తిరుపతి జిల్లా: తల్లిదండ్రులు లేని వ్యక్తికి కూతురిని ఇచ్చి ఇల్లరికం తెచ్చుకుని కొడుకుతో సమానంగా చూస్తున్న అత్తనే అల్లుడు హతమార్చాడు. ఈ ఘటన తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలోని తుమ్మూరులో బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని అయ్యప్పరెడ్డిపాళేనికి చెందిన సగటూరు చెంగమ్మ(47) మూడో కుమార్తె స్వాతిని పండ్లూరుకి చెందిన బోడెద్దుల వెంకయ్యకు ఇచ్చి వివాహం చేసింది. ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసే వెంకయ్యను చెంగమ్మ ఇల్లరికం పెట్టుకుని కుమార్తెతో కలిసి ఉంటోంది. వెంకయ్యకు మూడేళ్ల కుమార్తె కూడా ఉంది.
వెంకయ్యకు మూడు నెలల క్రితం కొన్ని వ్యాధులు సోకడంతో ఇంటి నుంచి పంపించేశారు. అయితే అల్లుడికి అన్ని విధాలుగా అత్త సహాయ సహకారాలు అందిస్తోంది. భార్యతో కాపురం చేయనివ్వడం లేదని కక్ష పెట్టుకున్న వెంకయ్య.. మంగళవారం మధ్యాహ్నం చెంగమ్మకు ఫోన్‌చేసి మాట్లాడాలని రమ్మన్నాడు. నెల్లూరు నుంచి వస్తున్న చెంగమ్మ స్వర్ణముఖి బ్రిడ్జి సమీపంలో అల్లుడితో మాట్లాడేందుకు దిగింది. అత్త మీద కోపంగా ఉన్న వెంకయ్య ఒక్కసారిగా కత్తితో ఆమెపై విచక్షణారహితంగా గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు. ఎవరూ గుర్తించకుండా ఆమెను స్వర్ణముఖి నది కట్టమీద నుంచి కిందకు తోసేశాడు.
మంగళవారం రాత్రి ఆమెను నదిలో పూడ్చిపెట్టి ఏమీ తెలియనట్టు బుధవారం ఉదయం అయ్యప్పరెడ్డిపాళేనికి వెళ్లాడు. అనుమానం వచి్చన గ్రామస్తులు వెంకయ్యను నిలదీయడంతో చెంగమ్మను హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడు. నాయుడుపేట పోలీసులు వెంకయ్యను అదుపులోకి తీసుకుని విచారించారు. అత్త మృతదేహాన్ని స్వర్ణముఖి బ్రిడ్జి సమీపంలో నదిలో పూడ్చిపెట్టినట్లుగా పోలీసులకు వివరించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బుధవారం సాయంత్రం మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.