తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఈతకు వెళ్లి విద్యార్థులు గల్లంతైన ఘటనపై రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సరదాగా గడిపేందుకు ఇసుకపల్లి బీచ్‌కు వెళ్లిన విద్యార్ధులు గల్లంతవడం విషాదకరమన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు వైఎస్ జగన్ పేర్కొన్నారు.
నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లి బీచ్‌లో ఈతకెళ్లి నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైనవారు అల్లూరు పంచాయతీ ఎర్రగుంటకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. తీరానికి ఇద్దరి మృతదేహాలు కొట్టుకు రావడంతో బయటకు తీశారు. మిగిలిన ఇద్దరు యువకుల కోసం మత్స్యకారులు గాలింపు చేపట్టారు.


