సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో రేపు(మంగళవారం) జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో సిట్ పేర్కొంది.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. గచ్చిబౌలిలోని హరీష్ రావు ఇంటికి వెళ్లిన పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే, హరీష్ ఇంట్లో లేని సమయంలో పోలీసులు నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. హరీష కుటుంబ సభ్యులకు పోలీసులు నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా కేసు విషయమై రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో విచారణకు రావాలని పేర్కొన్నారు. దీంతో, ఫోన్ ట్యాపింగ్ కేసు మరో టర్న్ తీసుకుంది. 
అయితే, గతంలోనే తన ఫోన్‌ను ట్యాప్ చేయించారంటూ మాజీ మంత్రి హరీష్ రావుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు అయ్యింది. దీన్ని సవాల్ చేస్తూ హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. సరైన ఆధారాలు లేనందున ఈ కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంలో విచారణ జరగ్గా.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఇప్పుడు సిట్ నోటీసులు ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. ఇదిలా ఉండగా.. జూన్ 2024లో తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసును వీసీ సజ్జనార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.


