సాక్షి, హైదరాబాద్: నగరంలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. దీంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కూలిన భవన శిథిలాలు పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్ మీద పడిపోయాయి. ఈ ప్రమాదంతో అక్కడున్న వాళ్లంతా భయంతో ఒక్కసారిగా పరుగులు తీశారు.
శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాలువను ఆనుకుని ఉన్న కేవలం 50 గజాల స్థలంలో ఈ భవనం నిర్మించ తలపెట్టినట్లు తెలుస్తోంది. భవనం కూలిపోవడంతో శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా? అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభం అయ్యాయి. ఇటు ఈ భవన నిర్మాణానికి అసలు అనుమతులు ఉన్నాయా? అనేదానిపై అధికారులు స్పందించాల్సి ఉంది.


