
సాక్షి, హైదరాబాద్: సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కస్టడీ విచారణలో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ పేరుతో పేదింటి ఆడబిడ్డలకు ఉచితంగా ఫెర్టిలిటీ సేవలు చేస్తామంటూ గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఏపీలోని పలు జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాలే టార్గెట్‌గా మెడికల్ క్యాంపులు నిర్వహించిన డాక్టర్ నమ్రత.. పేద మహిళలను గుర్తించింది. పేద మహిళల ఆర్థిక అవసరాలను గుర్తించి.. ఏజెంట్‌లు ట్రాప్‌లోకి లాగుతూ.. ఆర్థికంగా ఆశ చూపి పిల్లలను కన్న తర్వాత డబ్బులు ఇస్తామని ఎర వేసినట్లు పోలీసులు నిర్థారించారు.
విశాఖపట్నం, విజయవాడ కేంద్రంగా డెలివరీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. డెలివరీ అయిన తర్వాత డాక్టర్ నమ్రత బృందం.. నవజాత శిశువును తీసుకుని తల్లికి డబ్బులు ఇస్తున్నట్లు విచారణలో తేలింది. అలా నవజాత శిశువులను తీసుకొచ్చి డాక్టర్ నమ్రత బ్యాచ్.. చైల్డ్ ట్రాఫికింగ్ పాల్పడుతోంది. సరోగసి ద్వారా అద్దె గర్భంలో పుట్టిందంటూ బాధిత దంపతులకు ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్రమంగా సంపాదించిన డబ్బులతో హైదరాబాద్, ఏపీలో ఫామ్ హౌస్, భవన సముదాయాలు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మియాపూర్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, యూసఫ్‌గూడతో పాటు చాలా ప్రాంతాల్లో భవన సముదాయాలు కొనుగోలు చేసినట్లు విచారణలో బయపడ్డాయి.
సృష్టి సెంటర్ కేసులో ఏ3 కల్యాణి, A6 సంతోషి స్టేట్‌మెంట్లు విచారణలో కీలకంగా మారనున్నారు. ఏఎన్ఎం, ఆశా వర్కర్లు ఏజెంట్స్ ద్వారా చైల్డ్ ట్రాఫికింగ్ పాల్పడ్డ డాక్టర్ నమ్రత.. కల్యాణి, సంతోషిలే దగ్గరుండి నవజాత శిశువులను తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించినట్లు తేలింది. పోలీసుల విచారణలో డాక్టర్ నమ్రత అక్రమాలు.. ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.