బతుకులు బుగ్గి! అప్పుడు క్రాకర్స్, ఇప్పుడు ఎలక్ట్రికల్‌ వెహికిల్స్‌..

Secunderabad Fire Tragedy: Timeline of Major Fire Tragedies in Hyderabad - Sakshi

కింది అంతస్తులో రాజుకున్న అగ్గి కీలలు

పైన ఉన్న భవనానికి పాకి ప్రాణాలు బలి

2002లో కార్తికేయ లాడ్జీలో 12 మంది మృతి

తాజాగా రూబీ లాడ్జీలో 8 మంది దుర్మరణం

సాక్షి, హైదరాబాద్‌: రాజధాని నగరంలోని దుకాణాలు, కంపెనీలు, సంస్థలు, గోదాముల్లో అగ్ని ప్రమాదాలు కలవరం రేపుతున్నాయి. నాటి కార్తికేయ లాడ్జి, నేటి రూబీ లాడ్జీ ఉదంతాల్లో మాత్రం ఓ సారూప్యత ఉంది. మొదట అగ్ని ప్రమాదం ఈ రెండింటిలోనూ ప్రారంభంకాలేదు. వీటికి కింది అంతస్తుల్లో ఉన్న దుకాణాల్లో మొదలైన అగ్గి లాడ్జీలో బస చేసిన వారి ఉసురు తీసింది.  

ప్రమాదాలు ఎలా జరిగాయంటే..
ఉస్మాన్‌గంజ్‌లోని ప్రధాన రహదారిపై ఉన్న భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో శాంతిఫైర్‌ వర్క్స్‌ ఉంది. దీని మొదటి అంతస్తులో కెనరా బ్యాంక్‌ శాఖ ఉండగా... రెండు, మూడు అంతస్తుల్లో కలిపి కార్తికేయ లాడ్జి నడిచేది. ఈ రెండు ఉదంతాల్లోనూ మృతులు బయటి ప్రాంతాల నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. 

ఘరానా దొంగ మారుతి నయీం 2002 అక్టోబర్‌ 23న శాంతి ఫైర్‌ వర్క్స్‌లో చోరీ చేయడానికి వచ్చాడు. తన కారును అడ్డంగా పెట్టి షట్టర్‌ పగులకొట్టిన నయీం దుకాణంలోకి ప్రవేశించాడు. అందులో నగదు లభించకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురై అక్కడ ఉన్న క్రాకర్స్‌ను నిప్పు పెట్టాడు. అలా మొదలైన మంటలు పై అంతస్తులకు పాకాయి. బ్యాంక్‌ దగ్ధం కాగా.. కార్తికేయ లాడ్జీలో బస చేసిన వాళ్లు, సిబ్బందితో సహా మొత్తం 12 మంది చనిపోయారు. 

తాజాగా సోమవారం రాత్రి జరిగిన రూబీ లాడ్జి ఉదంతమూ ఈ కోవకు చెందినదే. దీని సెల్లార్‌లో ఉన్న ఎలక్ట్రికల్‌ బైక్‌ షోరూమ్‌లో అగ్గి రాజుకుంది. ఈ ధాటికి విడుదలైన మంటలు, పొగ..  పైన ఉన్న లాడ్జీలో బస చేసిన ఎనిమిది మంది ప్రాణాలను బలిగొన్నాయి. మరో 10 మంది క్షతగాత్రులుగా మారారు. (క్లిక్ చేయండి: చివరి నిమిషంలో రూబీ లాడ్జీలో దిగి.. మృత్యువు పిలిచినట్టు..)

నగరంలో భారీ అగ్ని ప్రమాదాల్లో మరికొన్ని.. 

► 21.10.2006: సోమాజిగూడలోని మీన జ్యువెలర్స్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో పెయింటింగ్‌ పని చేయడానికి వచ్చిన వలస కార్మికులు పై అంతస్తులో నిద్రిస్తున్నారు. కింది ఫ్లోర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంతో పెయింట్లు కాలి, విడుదలైన విష వాయువులతో ముగ్గురు చనిపోయారు.  

► 24.11.2012: పుప్పాలగూడలోని బాబా నివాస్‌ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది చనిపోయారు. వాచ్‌మన్‌తో పాటు స్థానికుల అప్రమత్తత కారణంగా దాదాపు మరో పది మంది ప్రాణాలతో బయటపడ్డారు.  

► 22.02.2017: అత్తాపూర్‌లోని పిల్లర్‌ నెం.253 సమీపంలో ఉన్న చిన్నతరహా పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కూలర్ల పరిశ్రమలో మంటలు చెలరేగి ఆరుగురు ఒడిశాకు కార్మికులు చనిపోయారు.  

► 23.03.2022: న్యూ బోయగూడ వద్ద శ్రావణ్‌ ట్రేడర్స్‌ పేరుతో ఉన్న స్క్రాప్‌ గోదాంలో సంభవించిన అగ్నిప్రమాదంలో 11 మంది బిహార్‌ కార్మికులు మృత్యువాత పడ్డారు.  (క్లిక్ చేయండి: సికింద్రాబాద్‌ అగ్నిప్రమాదం: నిప్పుల్లో నిబంధనలు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top