చివరి నిమిషంలో రూబీ లాడ్జీలో దిగి.. మృత్యువు పిలిచినట్టు..

Secunderabad Fire Tragedy: Victims Identified, Suffocation Causes to Death - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ అగ్ని ప్రమాద మృతులతో గాంధీ మార్చురీ వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. మూడు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి వాయుమార్గంతో పాటు ప్రత్యేక అంబులెన్స్‌ల్లో స్వస్థలాలకు తరలించారు. మిగిలిన అయిదు మృతదేహాలకు సంబంధించి ఆయా వ్యక్తుల సంబంధీకుల కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఏర్పాట్లను పర్యవేక్షించగా, గాంధీ సూపరింటెండెంట్‌ రాజారావు, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ హెచ్‌ఓడీ కృపాల్‌సింగ్‌ల నేతృత్వంలో మూడు వైద్య బృందాలు పోస్టుమార్టం విధులు నిర్వహించారు.  


విషవాయువుల వేడి పొగతోనే.. 

బ్యాటరీలకు మంటలు అంటుకుని కెమికల్‌ టాక్సిన్స్‌ (విష వాయువులు)తో కూడిన వేడి పొగ పీల్చడం వల్లే ఊపిరి అందక మృతి చెందినట్లు ఫోరెన్సిక్‌ వైద్యులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మృతదేహాల ఊపిరితిత్తులకు అంటుకున్న పొగతో కూడిన విషవాయువు (స్మాగ్‌) కడుపు, ఇతర అవయవాల నుంచి నమూనాలు సేకరించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపనున్నట్లు గాంధీ సూపరింటెండెంట్‌ రాజారావు తెలిపారు.  


మృత్యువు పిలిచినట్టు..
  
విజయవాడకు చెందిన అల్లాడి హరీష్‌ను మృత్యువు పిలిచిందని ఆయన స్నేహితుడు శ్రీనివాస్‌ కన్నీటి పర్యంతమయ్యారు. ఈక్వటస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులో పనిచేస్తున్న హరీష్‌ ట్రైనింగ్‌ నిమిత్తం నగరానికి వచ్చే ముందే సికింద్రాబాద్‌ మినర్వా గ్రాండ్‌ లాడ్జీలో బస చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. చివరి నిమిషంలో రూబీ లాడ్జీలో దిగి ప్రమాదంలో మృతి చెంది కానరాని లోకాలకు వెళ్లిపోయాడని భోరున విలపించారు. మృతునికి భార్య కావ్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు పన్నెండు రోజుల క్రితమే జన్మించాడు. మార్చురీలో హరీష్‌ మృతదేహాన్ని చూసి ఆయన తండ్రి కోటేశ్వరరావు రోదనలు కలచివేశాయి.  

చెన్నై నుంచి వచ్చి.. మృత్యువాత 
విధి నిర్వహణలో భాగంగా చెన్నై నుంచి నగరానికి వచ్చి రూబీ లాడ్జీలో బస చేసి అగ్నిప్రమాదంలో మృతి చెందారు ఆచీ మసాల సంస్థ ఉద్యోగులు బాలాజీ, సీతారామన్‌లు. ఆచీ మసాల ఆడిటర్‌ బాలాజీ, రీజనల్‌ సేల్స్‌ మేనేజర్‌ సీతారామన్‌లు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు ప్రాంతాల్లో విధులు నిర్వర్తించి, రాత్రి 8 గంటలకు లాడ్జీకి వచ్చి అగ్ని ప్రమాదంలో అసువులు బాశారని ఆచీ మసాల స్థానిక సేల్స్‌ మేనేజర్‌ మహేందర్‌ కన్నీటి పర్యంతమయ్యారు. బాలాజీ, సీతారామన్‌ల మృత దేహాలను విమానంలో  చెన్నైకి తరలించారు.  


ఢిల్లీకి చెందిన అన్నదమ్ములు...

ఢిల్లీకి చెందిన సందీప్‌ మాలిక్, రాజీవ్‌ మాలిక్‌లు అన్నదమ్ములు. ఆలివ్‌ కంపెనీలో శిక్షణ కోసం సిటీకి వచ్చి రూబీ లాడ్జీలో బస చేసి మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న మృతుల బంధువులు నగరానికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదం జరగడానికి కొన్ని నిమిషాల ముందే ఆ లాడ్జి మొదటి అంతస్తులోని రూమ్‌ నుంచి చెక్‌ఔట్‌ చేసిన ముగ్గురు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. (క్లిక్ చేయండి: సికింద్రాబాద్‌ అగ్నిప్రమాద ఘటనకు కారణం అదే)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top