Secunderabad Fire Mishap: అంతులేని వేదన.. తప్పని నిరీక్షణ

Secunderabad Fire Accident: Searching For Missing 2 Workers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మినిస్టర్‌ రోడ్‌లోని రాధా ఆర్కేడ్‌ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో గల్లంతైన వారి కోసం బంధువులు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. మూడవ రోజు ఒక మృతదేహం మాత్రమే లభ్యం కాగా మరో ఇద్దరు ఎక్కడ ఉన్నారనే ఆందోళన బంధువుల్లో నెలకొంది. ప్రమాదం జరిగిన రోజు నుంచి శనివారం వరకు గల్లంతైన జునైద్, జహీర్, వసీంల బంధువులు ప్రమాదం జరిగిన భవనం వద్దే నిరీక్షిస్తూ తమ వారి కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఎదురు చూస్తున్నారు.

నిద్రాహారాలు మాని, కుటుంబ సభ్యులు మొత్తం ఏ క్షణంలో ఎలాంటి సమాచారం వస్తుందోనని ఎదురు చూస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఒకరి మృతదేహం లభ్యం కాగా అది ఎవరిదనేది తేల్చేందుకు మరో రెండు రోజుల సమయం పడుతుందని వైద్యులు చెబుతుండటంతో రెండు రోజులు అదే టెన్షన్‌ భరించాల్సిన పరిస్థితి వచ్చింది.  

భవనం కూలగొడతారనే ఆందోళన... 
భవనం మొత్తం శిథిలాలు, బూడిదతో నిండిపోవడంతో ఇద్దరి మృతదేహాలు లభ్యమవుతాయా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సందర్భంలో భవన పటిష్టత పరిశీలించి కూలగొడతామని అధికారులు అంటుండటంతో మృతదేహాల కోసం గాలింపు చేపట్టకుండానే కూలగొడతారేమోనని  కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనం కూలగొడితే తమ వారు ఉన్నారా, లేదా కనీసం చనిపోయి ఉంటే అవశేషాలైనా ఇస్తే అంత్యక్రియలు జరుపుకొంటామని కన్నీటిపర్యంతం అవుతున్నారు.  

భవనాన్ని పరిశీలించిన మంత్రి 
అగ్ని ప్రమాదం జరిగిన రాధా ఆర్కేడ్‌ భవనాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ శనివారం ఉదయం పరిశీలించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్, కలెక్టర్‌ అమోయ్‌కుమార్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటి, ఫైర్‌ ఆఫీసర్‌ పాపయ్య తదితరులతో కలిసి ఆయన క్రేన్‌ ద్వారా భవనం మొత్తం బయటి నుంచి పరిశీలించారు. అనంతరం పక్కనే ఉన్న కాచిబోలికి వెళ్లి బస్తీ ప్రజలతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు. బస్తీ ప్రజలు ఇప్పుడే ఇళ్లలోకి రావద్దని, ప్రమాదం జరిగిన భవనం కూలి్చవేసిన తర్వాత బస్తీలో ఇండ్లకు ఎలాంటి నష్టం జరిగినా తానే బాధ్యత తీసుకుంటానని ఈ సందర్భంగా తలసాని హామీ ఇచ్చారు. భవనం ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని, అక్కడి నుంచి వచ్చే వేడితో ఏమైనా జరిగే అవకాశాలున్నాయని ఆయన ప్రజలను హెచ్చరించారు. అంత వరకు మున్నూరు కాపు సంఘం భవనంలో బస చేయాలని, భోజన సదుపాయాలు కల్పించామని చెప్పారు.  

శాయశక్తులా పనిచేస్తున్నారు 
అక్కడే ఉన్న గల్లంతైన వారి బంధువులతో మంత్రి తలసాని మాట్లాడారు. ప్రమాదం జరిగిన రోజు నుంచి అధికార యంత్రాంగం గల్లంతైన వారి ఆచూకీ కోసం శాయశక్తులా కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రమాదంలో మరణించి ఉంటే ఆ కుటుంబాలను ప్రభుత్వం తప్పక ఆదుకుంటుందన్నారు. 

గాలి మాటలు తగదు..  
అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు జరిగినపుడు నేతలు ప్రజలకు అండగా ఉండాలే కాని నోటికి వచ్చినట్లు రాజకీయాలు మాట్లాడడం సరికాదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి హితవు పలికారు. ప్రజలంతా ఆందోళనలో ఉన్నపుడు వారికి భరోసా కల్పించాల్సింది పోయి ప్రభుత్వం ఆదాయం కోసం క్రమబద్దీకరణ చేస్తుందని అనడం విడ్డూరంగా ఉందన్నారు. మంటల్లో గల్లంతైన వారి కోసం కొత్తగా వచ్చిన సాంకేతిక రోబోటిక్‌ సహాయంతో వెతికిస్తామని చెప్పారు. కొన్ని దశాబ్దాల నుంచి నగరంలో అనేక అక్రమ నిర్మాణాలు, జనావాసాల్లో గోదాములు, ప్రమాదకరమైన భవనాలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. వీటిపై ఈ నెల 25వ తేదీన ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని అన్నారు.  

ఆచూకీ దొరికేంత వరకు కూలగొట్టవద్దు: అమీన్‌ 
అగ్ని ప్రమాదంలో గల్లంతైన వారి ఆచూకీ దొరికేంత వరకు భవనాన్ని కూలగొట్టవద్దని వసీం సోదరుడు అమీన్‌ అన్నారు. ముగ్గురు వ్యక్తులు ప్రమాదంలో చిక్కుకుని పోతే దొరకబట్టలేరా అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చివరి క్రియలు చేసుకునే అవకాశం కూడా మాకు వద్దా అని ఆయన కన్నీటి పర్యంతమయ్యాడు. వసీం గత 16 సంవత్సరాలుగా డెక్కన్‌ కార్పొరేషన్‌లో పనిచేస్తున్నాడని, ప్రమాదం జరిగిన రోజు యజమాని ఇక్కడికి పిలిపించడంతోనే ఇదంతా జరిగిందని వాపోయారు.

వసీంకు భార్య, 8 ఏళ్ల కుమారుడు, కుమార్తె (కవలలు) ఉన్నారు. గుజరాత్‌కు చెందిన జహీర్‌ (21) అలియాస్‌ సుఫియాన్‌ గత 8 నెలల క్రితం నుంచి దక్కన్‌ నిట్‌వేర్‌లో పనిచేస్తున్నాడు. జునైద్‌ కూడా గుజరాత్‌ నుంచి వచ్చి నల్లగుట్టలో భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు.  

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top