సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. షెడ్యూల్ విడుదలకు ముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కీలక భేటీ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీ కూడా పాల్గొంటారు. ఈ సమావేశం అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జిల్లా కలెక్టర్లతోనూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని సమాచారం.
ఈ సమావేశాల అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. వచ్చే నెల 11 లేదా 12వ తేదీన పోలింగ్ నిర్వహించి 15వ తేదీలోపు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ముగించేలా షెడ్యూల్ ఉంటుందని సమాచారం. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్‌లకు ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే.


