ఉపాధ్యాయురాలిగా... ఉత్తమ సర్పంచ్‌

Sarpanch Indori Shashikala Teaching Lessons To Students In Adilabad - Sakshi

సాక్షి, నెన్నెల (ఆదిలాబాద్‌): ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ, గ్రామాభివృద్ధికి పాటు పడటమే కాదు.. విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ, వారికి దగ్గరుండి భోజనం వడ్డిస్తూ శభాష్‌ అనిపించుకోంటోంది గొళ్లపల్లి సర్పంచ్‌ ఇందూరి శశికళ. సాధారణంగా సర్పంచ్‌లు గ్రామ సమస్యల పరిష్కారానికి పని చేస్తూ ఉంటారు. అందుకు భిన్నంగా టీచరమ్మగా మారి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతూ, వారి అభ్యున్నతికి చొరవ చూపుతోంది.

ఆమె పని తీరును మెచ్చుకొని జిల్లా కలెక్టర్‌ భారతిహోళ్లీకేరి 2020లో మహిళా దినోత్సవం సందర్భంగా ఉత్తమ మహిళా సర్పంచ్‌గా పురస్కారం ప్రదానం చేసి ప్రత్యేకంగా అభినందించారు. వివరాల్లోకి వెళ్తే.. నెన్నెల మండలం గొల్లపల్లి సర్పంచ్‌ ఇందూరి శశికళ ఎంఎస్సీ బీఈడీ పూర్తి చేసింది. గొల్లపల్లి ప్రాథమిక పాఠశాలలో 1–5 తరగతుల విద్యార్థులు 86మంది ఉన్నారు. మొత్తం ఐదుగురు టీచర్లు ఉండగా, ఇద్దరు ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై మరో చోటికి పంపించారు.

మంగళవారం ముగ్గురు ఉపాధ్యాయులలో ఇద్దరు లీవ్‌లో ఉండగా, ఆ సర్పంచ్‌ పాఠశాలకు వెళ్లి పిల్లలకు ఆంగ్లమాధ్యమంలో బోధిస్తూ, దగ్గరుండి భోజనం వడ్డించారు. అటు రాజకీయంగా ఊరికి సేవలు చేస్తూ, ఇటు పిల్లలకు విద్యాదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులు లేక బోధన సాగకపోవడంతో విద్యాబోధన చేస్తున్నానని సర్పంచ్‌ పేర్కొంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top