అభ్యర్థుల్లో ‘కంగారు’ పుట్టించారు | Sandhya Reddy Wins Australian Local Body Elections | Sakshi
Sakshi News home page

అభ్యర్థుల్లో ‘కంగారు’ పుట్టించారు

Dec 30 2021 5:10 AM | Updated on Dec 30 2021 3:02 PM

Sandhya Reddy Wins Australian Local Body Elections - Sakshi

సంధ్యారెడ్డి 

తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆస్ట్రేలియాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కౌన్సిలర్లుగా గెలిచి సత్తా చాటారు.

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆస్ట్రేలియాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కౌన్సిలర్లుగా గెలిచి సత్తా చాటారు. సిడ్నీలోని కొన్ని మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా తెలంగాణకు చెందిన సంధ్యారెడ్డి అలియాస్‌ సాండీ రెడ్డి.. వెస్ట్‌ సిడ్నీలోని స్ట్రాత్‌ ఫీల్డ్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా గెలవగా, రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తి చెట్టిపల్లి లివింగ్‌స్టన్‌.. బ్లాక్‌ టౌన్‌ వార్డ్‌ 5 నుంచి విజయం సాధించారు.

అలాగే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన పిల్లలమర్రి శ్రీనివాస్‌ అలియాస్‌ శ్రీనీ.. హాన్స్‌ బీ వార్డు నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. లివింగ్‌స్టన్, శ్రీనివాస్‌ ఇద్దరూ లిబరల్‌ పార్టీ నుంచి గెలవగా సంధ్యారెడ్డి ఇండిపెండెంట్‌గా విజయం సాధించా రు. ఈ మేరకు బుధవారం ఫలితాలు వెల్లడించారు. 

కొండా ఫ్యామిలీ నుంచి.. 
కొండా రంగారెడ్డి సోదరుడు కొండా నారాయణరెడ్డి మనవరాలు సంధ్యారెడ్డి. ఈమె మేనమామ కొండా లక్ష్మణ్‌ రెడ్డి 1983లో చేవెళ్ల నుంచి అసెంబ్లీకి కాంగ్రెస్‌ తరఫున ఎన్నికయ్యారు. చిన్ననాటి నుంచి ఖైరతాబాద్‌లో పెరిగిన సంధ్యారెడ్డి.. 16 ఏళ్ల క్రితం నగరానికి చెందిన కర్రి బుచ్చిరెడ్డిని వివాహం చేసుకున్నారు. 30 ఏళ్ల క్రితమే ఆస్ట్రేలియా వెళ్లిన బుచ్చిరెడ్డి కంప్యూటర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తూ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.

సంధ్యారెడ్డి కూడా స్ట్రాత్‌ ఫీల్డ్‌లో  స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో పాటు క్లీన్‌ అప్‌ ఆస్ట్రేలియా నినాదంతో కార్యక్రమాలు చేశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు నీల్‌ రెడ్డి, నిఖిల్‌ రెడ్డి. ఇద్దరూ ప్రస్తుతం హైస్కూల్‌ విద్యాభ్యాసంలో ఉండగా చిన్న కుమారుడు నిఖిల్‌రెడ్డి నేషనల్‌ జూనియర్‌ చెస్‌ ఛాంపియన్‌గా నిలిచాడు.

డిప్యూటీ మేయర్‌ రేసులో సంధ్యారెడ్డి 
స్ట్రాత్‌ ఫీల్డ్‌ మున్సిపల్‌ డిప్యూటీ మేయర్‌ రేసులో సంధ్యారెడ్డి ఉన్నట్టు తెలిసింది. ఈ స్థానిక సంస్థలో ఏడుగురు కౌన్సిలర్లు ఉన్నారు. ఇందులో సంధ్యారెడ్డితో పాటు మరో ముగ్గురు ఇండిపెండెంట్‌గా గెలవగా మిగిలిన వాళ్లు స్థానిక పార్టీల నుంచి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ మేయర్‌గా సంధ్యారెడ్డికి అవకాశం వస్తుందని సిడ్నీలోని భారతీయులు భావిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement