టెన్షన్‌ లేకుండా టెన్త్‌ పరీక్షలు 

Sabita Indra Reddy Video Conference on Exams - Sakshi

వేసవి దృష్ట్యా పిల్లలకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు..  

కరెంట్‌ పోకుండా చూడండి 

జిల్లా కలెక్టర్లకు మంత్రి సబిత ఆదేశం.. పరీక్షలపై వీడియో కాన్ఫరెన్స్‌ 

సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, ఆందోళన లేకుండా పదవ తరగతి పరీక్షలు రాసేందుకు సన్నద్ధం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను కోరారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని, వారికి అసౌకర్యం కలగకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వచ్చే నెల 3 నుంచి టెన్త్‌ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో పాఠశాల విద్య సంచాలకురాలు దేవసేనతో కలసి మంత్రి సబిత బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పరీక్షలపై విద్యార్థులకు ఉన్న సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసి, వారిలో మనోధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత ఆయా యాజమాన్యాలతో పాటు అధ్యాపకులకు, తల్లిదండ్రులకు ఉందన్నారు.

లక్షల్లో విద్యార్థులు హాజరవుతున్న పదవ తరగతి పరీక్షలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతున్నారని, వీరి కోసం 2,652 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణలో జిల్లా కలెక్టర్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున, పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక జాగ్రత్తలతో పాటు విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు, తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని కోరారు. పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు వాటిని పరిశీలించే ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.

పరీక్షల సమయంలో విద్యుత్‌ సరఫరాకు ఆటంకం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి పరీక్ష పేపర్లను 11 నుంచి 6 కు కుదించామని, సైన్స్‌ పరీక్ష రోజున భౌతిక శాస్త్రం, జీవ స్త్రాస్తానికి సంబంధించి ప్రశ్న పత్రాలను విడివిడిగా అందిస్తామని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్‌ టికెట్‌ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితప్రయాణం చేసే సౌకర్యం కూడా కల్పించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top