సూపర్‌ స్పెషాలిటీగా ఆర్టీసీ ఆస్పత్రి | Sakshi
Sakshi News home page

సూపర్‌ స్పెషాలిటీగా ఆర్టీసీ ఆస్పత్రి

Published Tue, May 9 2023 8:04 AM

RTC Hospital Tarnaka As Super Speciality - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంతకాలం సంస్థ ఉద్యోగులకే పరిమితమైన తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రి సాధారణ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిగా అవతరించింది. ఇటీవలే సాధారణ ప్రజల(ఆర్టీసీ ఉద్యోగులు కానివారు)కు ఔట్‌ పేషెంట్లుగా చికిత్స ప్రారంభించిన ఆర్టీసీ.. ఇప్పుడు సూపర్‌ స్పెషాలిటీ సేవలతో ముందుకొచ్చింది. ఇందుకోసం 16 పడకలతో కూడిన ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ను సిద్ధం చేసింది. నాలుగు ఆపరేషన్‌ థియేటర్లను కూడా కొత్తగా ఏర్పాటు చేసుకుంది. వీటిని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ మంగళవారం ఉదయం ప్రారంభించనున్నారు.  

ఏడు ఆపరేషన్‌ థియేటర్లు.. 
గతంలో అత్యవసర వైద్య సేవలు అందించే పరిస్థితి లేకపోవటంతో ఇక్కడికి వచ్చే రోగులను ఇతర ఆసుపత్రులకు రిఫర్‌ చేసేవారు. ఆ స్థితి నుంచి క్రమంగా కీలక చికిత్సలు, అత్యవసర ఆపరేషన్లు చేసే స్థాయికి తార్నాక ఆసుపత్రిని అప్‌గ్రేడ్‌ చేశారు. ప్రస్తుతం మూడు ఆపరేషన్‌ థియేటర్లు ఉన్నాయి. కొత్తగా మరో నాలుగు ఆపరేషన్‌ థియేటర్లను సిద్ధం చేశారు. అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌ భవనంపై కొత్తగా ఐసీయూ బ్లాక్‌ను నిర్మించారు. ఇందులో 16 బెడ్లు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులే కాకుండా సాధారణ ప్రజలకూ ఇందులో చికిత్స అందిస్తారు. నిమ్స్‌ తరహాలో తక్కువ చార్జీలు వసూలు చేయనున్నారు. రోజుకు రూ.3 వేలు, అంతకంటే తక్కువే వసూలు చేయనున్నట్టు సమాచారం.  

త్వరలో సర్జికల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌.. 
ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆధునిక వసతులతో ఉండే సర్జికల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ను కూడా ఆర్టీసీ ఆసుపత్రిలో సిద్ధం చేశారు. త్వరలో దీన్ని వినియోగంలోకి తేనున్నారు. ఆపరేషన్‌ థియేటర్లు, ఐసీయూ ప్రారంభించిన తర్వాత, ఎస్‌ఐసీయూ బ్లాక్‌లో ఫ్యూమిగేషన్‌ చేసి, బ్యాక్టీరియా కల్చర్‌ పరీక్షలు నిర్వహించి నెగెటివ్‌ రిపోర్టు వస్తే వెంటనే దాన్ని అందుబాటులోకి తెస్తారని సమాచారం. సూపర్‌స్పెషాలిటీ వైద్యం అందిన వారు, కీలక ఆపరేషన్లు చేయించుకున్న రోగులు.. కొంతకాలం ఐసీయూలో ఉండాల్సి వస్తే ఇందులో ఉంచుతారు. వార్డులో ఓవైపు దీన్ని కొత్తగా ఏర్పాటు చేశారు.  
ఇక ప్రతి డిపోలో హెల్త్‌ వాలంటీర్లు.. 
ఇటీవలే ఆర్టీసీ ఉద్యోగులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి వారి హెల్త్‌ హిస్టరీతో కూడిన రికార్డులను సిద్ధం చేశారు. గుండె సమస్యలు, ఇతర తీవ్ర ఆరోగ్య ఇబ్బందులతో బాధపడుతున్నట్లు గుర్తించిన ఉద్యోగులకు ప్రత్యేకంగా వైద్య సేవలు అందిస్తూ, వారు క్రమపద్ధతిలో మందులు వాడేలా చూస్తున్నారు. గుండె సంబంధిత సమస్యలున్నాయని తేలిన 278 మంది ఉద్యోగుల్లో ఇద్దరు మందుల వాడకంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కొద్ది రోజుల్లోనే వారు మృతి చెందారు. ఇలాంటి పరిస్థితి మిగతావారికి రావద్దనే ఉద్దేశంతో ప్రతి డిపోలో సుశిక్షితులైన ఇద్దరు హెల్త్‌ వర్కర్లను నియమించాలని ఆర్టీసీ నిర్ణయించింది. వీరు ఉద్యోగులకు ఆరోగ్యంపట్ల అవగాహన కల్పించడంతోపాటు వారి హెల్త్‌ హిస్టరీ ఆధారంగా మందులు వాడేలా చూస్తారు. 

అలాగే వీరి వద్ద డిజిటల్‌ బీపీ చెకింగ్‌ యంత్రాలుంటాయి. వాటి ద్వారా బీపీని మానిటర్‌ చేస్తూంటారు. ఉద్యోగులకు సీపీఆర్‌పై శిక్షణ ఇస్తారు. ఇప్పుడు ఈ హెల్త్‌ వర్కర్లకు శిక్షణ ప్రారంభించనున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement