ఇటీవలి వానలకు రాష్ట్రంలో మరింత తీవ్రంగా దెబ్బతిన్న రోడ్లు
మట్టి పోసి తాత్కాలిక మరమ్మతులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల కోసం ఎదురుచూపు
రూ.1,600 కోట్లు అవసరమని అంచనా... రాష్ట్ర నివేదికలపై స్పందించని కేంద్రం
ఇది రోడ్లు భవనాల శాఖ పర్యవేక్షించే రాష్ట్ర రహదారి. తాండూరు–జహీరాబాద్ రోడ్డులో రావులపల్లి గ్రామ శివారులో పరిస్థితి ఇది. ఎక్కడా తారు ఆనవాళ్లు అనేవి లేకుండా ఇలా మారింది. వాన కురిస్తే ఇక్కడ రాకపోకలు నిలిచిపోతాయి. గతేడాది వానాకాలంలో రోడ్డు కొట్టుకుపోగా, మరమ్మతులు చేయకపోవడంతో స్థానిక నేత ఒకరు సొంత ఖర్చుతో మట్టిపోయించి తాత్కాలికంగా రాకపోకలు జరిగేలా చేశారు. ఈసారి మళ్లీ కొట్టుకుపోయి అదే పరిస్థితి పునరావృతం అయింది. మళ్లీ స్థానిక నేతలు సొంత ఖర్చుతో మట్టి పోయించారు. దీంతో రోడ్డు ఈ మాత్రం కనిపిస్తోంది. కొత్త రోడ్డు నిర్మాణ పనులు ఏడాదిన్నర క్రితమే మంజూరైనా.. ఇప్పటివరకు పనుల జాడే లేదు. కనీసం టెండర్లు కూడా పిలవలేదు.
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు కురిసినప్పుడు దెబ్బతిన్న రోడ్లను తాత్కాలికంగా మరమ్మతు చేసి, ఆ తర్వాత పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తేనే వాహనాలు సాఫీగా ముందుకు సాగుతాయి. కానీ రాష్ట్రంలో చాలాచోట్ల ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఒక వానాకాలం ముగిసే సరికి రోడ్లకు సగటున రూ.2 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లుతోంది. అంటే వాటిని పునరుద్ధరించాలంటే అంతమేర నిధులు ఖర్చు చేయాలన్న మాట.
కానీ నిధుల లేమి రోడ్ల మరమ్మతుకు, కొత్త రోడ్ల నిర్మాణానికి ప్రతిబంధకంగా మారుతోంది. రోడ్ల మరమ్మతులకు భారీ మొత్తంలో నిధులు వెచి్చంచే పరిస్థితి లేకపోవటంతో కేంద్ర సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తోంది. కానీ కేంద్రం.. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారుల బృందాలను పంపటం తప్ప నిధులు ఇవ్వటం లేదు. గతేడాది రూ.2,300 కోట్ల మేర రోడ్లకు నష్టం వాటిల్లినందున అంతమేర నిధులు ఇవ్వాలని కేంద్ర బృందాలకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమరి్పంచింది. ఆ తర్వాత పలు సందర్భాల్లో కేంద్ర మంత్రుల ముందు కూడా ప్రస్తావించింది. కానీ నయా పైసా రాలేదు.
బాగా దెబ్బతిన్న రోడ్లు
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. మోంథా తుపాను కంటే ముందు కురిసిన వర్షాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు వచ్చాయి. 1,400 కి.మీ మేర రోడ్లు దెబ్బతిన్నాయని, రూ.1,278 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, తాత్కాలిక మరమ్మతులకు రూ.78 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. ఆ తర్వాత మోంథా తుపాను ప్రభావంతో నష్టం మరింత పెరిగింది.
ఈ రెండు నష్టాలు కలిపి దాదాపు రూ.1,600 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. 1,500 ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయని, మొత్తం 1,641 కి.మీ మేర రోడ్ల ఉపరితలం దెబ్బతిన్నదని పేర్కొంటూ కేంద్రానికి మరోసారి నివేదించింది. కానీ ఈ రెండు నివేదికలపైనా అక్కడి నుంచి స్పందన రాలేదు. రాష్ట్రం సొంత నిధులు ఇవ్వలేక పోవడం, కేంద్రం నుంచి నిధులపై స్పష్టత లేకపోవడంతో రోడ్లు రోజురోజుకూ మరింత దెబ్బతింటున్నాయి. తాత్కాలికంగా గుంతల్లో మట్టి నింపిన అధికారులు..పూర్తిస్థాయి మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణంపై చేతులెత్తేశారు. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆయా రోడ్ల మీద ప్రయాణాలంటే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది.
ఇటీవలి తుపాను ప్రభావం ఇలా..
జిల్లా దెబ్బతిన్న ప్రాంతాలు మరమ్మతులకు కావాల్సిన నిధులు (రూ.కోట్లలో)
కరీంనగర్ 16 6
వరంగల్ 50 86.34
హనుమకొండ 12 2.50
ములుగు 3 4.40
మహబూబాబాద్ 38 14.94
ఖమ్మం 63 54
భద్రాద్రి 15 22.95
నల్లగొండ 26 10.10
సూర్యాపేట 4 6.82
యాదాద్రి 11 4.31
జనగామ 21 13
సిద్దిపేట 27 40.19
రంగారెడ్డి 10 3.88
నాగర్‌కర్నూలు 86 49.44


