
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మరిపెడ మండలం ఎల్లంపేట దగ్గర జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో లారీ క్యాబిన్‌లో మంటలు చెలరేగడంతో ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ సజీవ దహనమయ్యారు.
ఇవాళ తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. లారీల్లో ఒకటి గ్రానైట్ లోడుతో, మరొకటి చేపల దానాతో వెళ్తున్నాయని పోలీసులు వెల్లడించారు. ఒక లారీ విజయవాడ నుంచి గుజరాత్ వెళ్తుండగా, మరో లారీ వరంగల్ నుంచి ఏపీ వైపు వెళ్తుందని తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని.. దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదం కారణంగా ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. క్యాబిన్‌లో సజీవదహనమైన మృతదేహాలను బయటకు తీసి మార్చురీకి తరలించారు.