
మేలో 10.07 మీటర్లు.. జూన్‌లో 9.47 మీటర్ల సగటు లోతుల్లో భూగర్భ జలాలు
జూలైలో 8.37 మీటర్ల వద్దే జలాలు.. భారీ వర్షాలతో పెరుగుతున్న నీటిమట్టం
హైదరాబాద్ జిల్లాలో 2.71 మీటర్ల వృద్ధి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలకు భూగర్భ జలమట్టాలు గణనీయంగా వృద్ధిచెందాయి. భూగర్భ జలాల సగటు లోతు గత మేలో 10.07 మీటర్లకు పడిపోగా, వర్షాలు ప్రారంభం కావడంతో జూన్‌లో 9.47 మీటర్లకు.. జూలైలో 8.37 మీటర్లకు పెరిగాయి. మేతో పోలిస్తే జూన్‌లో భూగర్భ జలమట్టాల సగటు 0.6 మీటర్లు, జూలైలో 1.69 మీటర్ల మేర వృద్ధి చెందినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, 2024 జూలైతో పోలిస్తే 2025 జూలైలో మాత్రం 0.13 మీటర్ల మేర భూగర్భ జలాలు తగ్గిపోయాయి.
2024 జూలైలో రాష్ట్ర భూగర్భజలాల సగటు నీటిమట్టం 8.25 మీటర్లు మాత్రమే కావడం గమనార్హం. రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ జూన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో భూగర్భ జలాల స్థితిగతులను పరిశీలించి తాజాగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. భూగర్భ జలవనరుల శాఖ రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలోని అన్ని మండలాల్లో ఏర్పాటు చేసిన 1,771 పీజోమీటర్ల ద్వారా భూగర్భ జలాల స్థితిగతులను ప్రతి నెలా సమీక్షించి, తర్వాతి నెలలో నివేదికలను విడుదల చేస్తూ ఉంటుంది.
మెదక్ జిల్లాలో 14.16 మీటర్ల లోతుకు..
ఈ సీజన్‌లో కృష్ణానది పరీవాహకంలో విస్తారంగా వర్షాలు కురవడంతో జలవనరుల్లో పుష్కలంగా నీరు చేరింది. దీంతో పరీవాహకం పరిధిలోని ప్రాంతాల్లో భూగర్భ జలాలు గణనీయంగా వృద్ధి చెందాయి. మరోవైపు గోదావరి పరీవాహకంలో వర్షాభావం నెలకొని ఉండటంతో అక్కడి కొన్ని జిల్లాల్లో భూగర్భ జలాలు జూన్‌తో పోలిస్తే జూలైలో మరింతగా దిగజారాయి.
గోదావరి పరీవాహక పరిధిలోని మెదక్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 14.16 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. కాగా, ఖమ్మం జిల్లాలో 3.87 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలోని జిల్లాలను సగటు భూగర్భ జలమట్టం 0–5 మీటర్లు, 5–10 మీటర్లు, 10 మీటర్లపైన లోతు.. అనే మూడు కేటగిరీలుగా వర్గీకరిస్తారు.
భూగర్భ జలాలు 0– 5 మీటర్లలోపు లోతులో ఉంటే సురక్షిత స్థాయిలో ఉన్నట్టు భావిస్తారు. రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలుండగా, 4 జిల్లాల్లో 0–5 మీటర్ల లోతులోనే భూగర్భ జలమట్టం ఉందని గుర్తించారు. 19 జిల్లాల్లో 5–10 మీటర్ల లోతులో, 10 జిల్లాల్లో 10–15 మీటర్ల లోతులో భూగర్భ జలాలున్నట్టు తేలింది. 10 మీటర్లకన్నా లోతుకు భూగర్భ జలాలు పడిపోయిన జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుగా భావిస్తారు.
సాధారణంతో పోలిస్తే వర్షపాతం తక్కువే..
జూలైలో రాష్ట్ర వార్షిక సగటు వర్షపాతం 358 మి.మీ.లు కాగా, 2025 జూన్‌లో 342 మి.మీ.ల సగటు వర్షపాతమే నమోదైంది. అంటే సాధారణం కంటే 4 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని స్పష్టమవుతోంది.
హైదరాబాద్‌లో భారీగా వృద్ధి..
హైదరాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో భారీగా భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. 2024 జూన్‌తో పోలిస్తే 2025 జూన్‌లో రాష్ట్రంలోని 15 జిల్లాల్లో భూగర్భ జలమట్టాల్లో వృద్ధి నమోదు కాగా, మరో 18 జిల్లాల్లో క్షీణత కనిపించింది. గత ఏడాది జూలైలో రాష్ట్ర సగటు భూగర్భ జలాల లోతు 8.25 మీటర్లుకాగా.. ఈ ఏడాది జూలైలో 8.37 మీటర్లుగా నమోదైంది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 2.71 మీటర్లు, అత్యల్పంగా మెదక్ జిల్లాలో 0.03 మీటర్ల వృద్ధి నమోదైంది.
431 మండలాల్లో మెరుగుదల
రాష్ట్రంలో మొత్తం 621 మండలాలు ఉండగా, దశాబ్దకాల సగటుతో పోలిస్తే.. గత జూన్ నెలలో 431 మండలాల్లో (79శాతం) 0.1 నుంచి 16.37 మీటర్ల వరకు భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. మిగిలిన 190 మండలాల్లో (21శాతం) 0.02 నుంచి 18 మీటర్ల వరకు భూగర్భ జలమట్టం పతనం అయిందని గణాంకాలు చెపుతున్నాయి.