ఓటుకు కోట్లు కేసు: రేవంత్, సండ్రలకు సుప్రీంలో ఊరట  

Revanth Reddy Sandra Supreme Court Judgement - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో తన పేరు తొలగించడాన్ని నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సవాల్‌ చేస్తూ సండ్ర వీరయ్య, ఏసీబీ కోర్టుకు ఈ కేసు విచారించే పరిధి లేదంటూ రేవంత్‌రెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్లను బుధవారం జస్టిస్‌ వినీత్‌ శరణ్, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం విచారించింది. రేవంత్‌ తరఫు న్యాయవాది సిద్ధార్థ లూత్రా, సండ్ర తరఫున న్యాయవాది కె.గులాటిలు వాదనలు వినిపించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుకూలంగా ఓటువేయాలంటూ ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్‌కు రేవంత్‌రెడ్డిసహా మరో ఇద్దరు లంచం ఇస్తూ దొరికారని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశా రని గులాటి తెలిపారు.  కేసుతో సండ్రకు సంబంధం లేదని వెల్ల డించారు. ఈ కేసు అవినీతి నిరోధక చట్టం కిందకు రాదని సిద్దార్ధ లూత్రా తెలిపారు. అయితే, ఈ కేసులో స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇస్తూ రేవంత్‌రెడ్డి తదితరులు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారని, ఇది అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందని ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది హరీన్‌ రావెల్‌ తెలిపారు. వాదన అనంతరం హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. మంగళవారంలోగా కౌంటరు దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, తదుపరి విచారణ సెప్టెంబర్‌ 7కు వాయిదా వేసింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top