ప్రజా రవాణా, రీసైకిల్డ్ వాటర్ వినియోగంపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
ఉద్యోగులు, కార్మికులకు సైతం సదుపాయంగా...
ఆధునిక సాంకేతికతకు పెద్దపీట వేయాలి
కేబీఆర్ చుట్టూ మరింత సజావుగా రాకపోకలు
రీసైకిల్డ్ వాటర్ వినియోగంపై పూర్తి స్థాయి అధ్యయనం
క్యూర్ పరిధిలోని పనుల సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: క్యూర్ పరిధిలో భవిష్యత్ అవసరాలకు తగినట్లు ప్రజారవాణా సదుపాయాలు మెరుగుపర్చాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. క్యూర్ పరిధిలో ప్రజారవాణా మెరుగుదల, వివిధ రహదారుల అనుసంధానత, రీసైకిల్డ్ వాటర్ వినియోగంపై శుక్రవారం రాత్రి సీఎం సమీక్షించారు. హైదరాబాద్ నగరంలో విపరీతమైన రద్దీ ఉన్న ప్రాంతాల్లో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ (పీఆర్‌టీ) సిస్టమ్ ఏర్పాటుకు అవసరమైన అంశాలపై అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా వివిధ అంశాలపై సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. ఎక్కువ మంది ప్రజలు రవాణా సాగించే ప్రదేశాలతో పాటు వివిధ కర్మాగారాల్లో పని చేసే కార్మికులు, ఉద్యోగులు రాకపోకలు సాగించే ప్రదేశాల నుంచి మెట్రో, ఎంఎంటీఎస్, బస్ స్టేషన్లతో అనుసంధానించేలా పీఆర్‌టీ ఉండేలా డిజైన్ చేయాలన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ పీఆర్‌టీలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు.
సజావుగా రాకపోకలు..
కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వేతో రాకపోకలు మరింత సజావుగా సాగేలా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యూటిలిటీస్ తరలింపును వేగవంతం చేసి పనులు త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీ చెక్ పోస్టు వైపు ఫ్లైఓవర్ పనులను వేగవంతం చేయాలన్నారు. ముంబై వంటి నగరాల్లో ఏడాదిలోపే పనులు పూర్తవుతున్నాయని, అక్కడి వినియోగిస్తున్న సాంకేతికత, పనుల తీరుపై అధ్యయనం చేయాలని సూచించారు.
హైదరాబాద్–ముంబై బుల్లెట్ ట్రైన్ మార్గానికి సమాంతరంగా రేడియల్ రోడ్డు నిర్మాణంపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. శంకర్‌పల్లి–చేవెళ్ల మధ్య ఇప్పుడు ఉన్న రహదారుల విస్తరణతో పాటు నూతన రోడ్ల నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు.
రీసైకిల్డ్ వాటర్ పై..
రీసైకిల్డ్ వాటర్ వినియోగానికి సంబంధించిన పనులు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. 500 ఎంఎల్‌డీ రీసైకిల్డ్ వాటర్ వినియోగానికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ, చందన్‌వల్లి, ఆలూరులోని డేటా సెంటర్లు, ఇతర పరిశ్రమలు రీసైకిల్డ్ వాటర్ వినియోగించుకునేందుకు వీలుగా పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. హైరైజ్ బిల్డింగుల నిర్మాణం, ల్యాండ్ స్కేప్స్, పార్కుల్లో రీసైకిల్డ్ వాటర్ వాడేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
సమన్వయంతో..
క్యూర్ చట్టం అమలుకు సంబంధించి హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లు, హైడ్రా, వాటర్ బోర్డు, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ అధికారులు సమన్వయంతో పని చేయాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల కార్యాలయాల పనులు వేగవంతం చేయాలని సూచించారు. సమీక్షలో సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సలహాదారు ఏవీఎస్ రెడ్డి, అదనపు మేనేజింగ్ డైరెక్టర్ అజిత్‌రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల కమిషనర్లు ఆర్‌వీ కర్ణన్, జి.సృజన, టి.వినయ్‌కృష్ణారెడ్డి, వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


